
పయ నించే సూర్యుడు జూన్ 26 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా రూ.20 లక్షల ఆర్థిక సాయం..మంత్రి చొరవతో మరో రూ.60 లక్షల సహాయానికి దాతల హామీ..డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా:- రామచంద్రపురం నియోజకవర్గం.ద్రాక్షారామం:- కూరగాయల మార్కెట్లో ఇటీవల సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో నష్టపోయిన వ్యాపారులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించారు. ఘటనాస్థలాన్ని సందర్శించి పరిస్థితులను స్వయంగా పరిశీలించిన మంత్రి, బాధితులతో మాట్లాడి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ తరఫున రూ.20 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అదేవిధంగా తన చొరవతో పలువురు దాతలు, సేవా సంస్థల ప్రతినిధులతో చర్చించి మరో రూ.60 లక్షల వరకు సహాయం అందేలా హామీలు తీసుకువచ్చినట్లు తెలిపారు.అగ్నిప్రమాదం కారణంగా ఉపాధిని కోల్పోయిన వ్యాపారులు తిరిగి తమ వ్యాపారాలను పునఃప్రారంభించే వరకు అవసరమైన సహకారం అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారికి చేయూతనివ్వడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొంటూ, ప్రభుత్వం, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్, దాతల సహకారంతో ప్రతి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.మంత్రి వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ వై. ఖోం నైదియా దేవి, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఆర్డీవో సరళావతి తదితర అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.3 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధుల ద్వారా బాధితులకు ప్రభుత్వ సహాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పోలీసు శాఖ తరఫున రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.రామచంద్రపురం ప్రాంతానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు, వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, సామాజిక సేవకులు, వ్యాపారవేత్తలు కూడా లక్షల్లో విరాళాలు ప్రకటించి బాధితులకు అండగా నిలుస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, జనసేన నాయకుడు పోలిశెట్టి చంద్రశేఖర్, బీజేపీ నాయకుడు దూడల శంకర్ నారాయణతో పాటు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.ఆపద సమయంలో వెంటనే స్పందించి సహాయం ప్రకటించిన మంత్రి వాసంశెట్టి సుభాష్, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్, పోలీసు శాఖతో పాటు విరాళాలు ప్రకటించిన దాతలకు మార్కెట్ వర్తక సంఘం నాయకులు సుబ్బరాజు ఆధ్వర్యంలో బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహకారం తమలో కొత్త ఆశతో పాటు ధైర్యాన్ని నింపిందని వారు పేర్కొన్నారు..