
ఊపిరాడని పరిస్థితిలో గండ్రవాణిగూడెం గ్రామ ప్రజలు – ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మాడుగులపల్లి మండలం, గండ్రవాణి గూడెం గ్రామంలో అక్రమ ఇటుక బట్టీల వ్యవహారం రోజురోజుకు విస్తరిస్తూ గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం, అండదండలతోనే ఈ అక్రమ వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయల వ్యాపారం సాగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.గ్రామ పరిసర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీల నుంచి వెలువడుతున్న పొగ, దుమ్ము కారణంగా గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటుకల తయారీలో రసాయన పదార్థాలను వినియోగించడం వల్ల వాయు కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని వారు చెబుతున్నారు. అక్రమ బట్టీల నిర్వహణపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు వాపోతున్నారు. అంతేకాకుండా, బట్టీల యజమానులు "మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు" అంటూ గ్రామ ప్రజలకే సవాల్ విసురుతున్నారని ఆరోపిస్తున్నారు. అక్రమ ఇటుక బట్టీల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతుండగా, పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో సంబంధిత రెవెన్యూ, కాలుష్య నియంత్రణ, గనుల శాఖ అధికారులు వెంటనే స్పందించి అక్రమ బట్టీలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.అధికారుల నిర్లక్ష్యమే అక్రమాలకు అండగా మారిందా..? లేక ప్రజల ఆరోగ్యంపై పెను ముప్పుగా మారిన ఈ ఇటుక బట్టీలపై ప్రభుత్వం ఎప్పుడు చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు గ్రామ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.