
పయనించే సూర్యుడు న్యూస్ :కూటమి ప్రభుత్వం.. అమరావతి నిర్మాణం, అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటుంది. ఒకవైపు అమరావతిని అభివృద్ధి చేస్తూనే.. మరోవైపు భవిష్యత్తు అవసరాల కోసం మరింత విస్తరించేందుకు రెడీ అవుతోంది. హైదరాబాద్ తరహాలో అమరావతి అభివృద్ధి చెందాలంటే 29 గ్రామాల పరిధి పరిపోదని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుతం 29 గ్రామాల్లో ఉన్న కోర్ క్యాపిటల్ పరిధి విస్తరించకపోతే అదో మున్సిపాలిటీలా మిగిలిపోతుందని అభిప్రాయపడ్డారు. అమరావతిని ఓ మామూలుగా నగరంగా కాకుండా ప్రపంచ స్థాయి నగరంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని… అమరావతి ఆ స్థాయిలో అభివృద్ధి చెందాలంటే తాను తీసుకునే నిర్ణయాలకు రైతుల నుంచి కూడా మద్దతు కావాలని సీఎం కోరారు. రాజధానికి భూమిలిచ్చిన రైతులుగా వారిపై అభిమానం, కృతజ్ఞత ఉన్నాయని తెలిపారు.కొన్ని సమస్యల విషయంలో అసంతృప్తిగా ఉన్న అమరావతి రైతులతో సమావేశమైన చంద్రబాబు కీలక అంశాలపై చర్చించి వారికి భరోసా ఇచ్చారు. ఈ భేటీలో రైతులు తమ సమస్యలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే.. చంద్రబాబు కూడా అమరావతి అభివృద్ధి ప్రణాళికపై రైతులతో మనసు విప్పి మాట్లాడారు. అమరావతి ప్రాంతానికి, రాజధాని రైతులకు న్యాయం చేసే బాధ్యత తనదేనని చంద్రబాబు అన్నారు. అమరావతే రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్‌గా ఉంటుందని.. ఇక్కడ జరిగిన అభివృద్ధి ఫలాలను రాజధాని రైతులే ముందు అందుకోవాలన్నారు. అభివృద్ధి ఫలాలు ఎలా ఉంటాయో హైదరాబాద్‌ను చేస్తే అర్థమవుతుందని తెలిపారు. తన హయాంలో భూ సేకరణ విషయంలో ఇబ్బందులు రాలేదని.. రానున్న రోజుల్లో భూముల ధరలు పెరగబోతున్నాయని తెలిపారు. రిటర్నబుల్ ప్లాట్లను ఎవరూ అమ్ముకోవద్దని సూచించారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అమరావతి పర్యటన నేపథ్యంలో క్యాపిటల్ గెయిన్స్‌పై మరో రెండేళ్లు పన్ను మినహాయింపు పొడిగించేలా కేంద్రాన్ని కోరాలని రాజధాని ప్రాంత రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. రైతుల సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలంగా స్పందించారు. పరిష్కరించదగ్గ సమస్యలన్నింటికీ త్రిసభ్య కమిటీ న్యాయం చేస్తుందని తెలిపారు. అమరావతికి వ్యతిరేకంగా కొందరు కావాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని రైతులు సీఎం దృష్టికి తెచ్చారు. అసత్య ప్రచారాన్ని కట్టడి చేస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అమరావతి ఉద్యమంలో భాగంగా అనేక జేఏసీలు వచ్చాయని, ఇప్పుడు రైతులంతా కలిసి అమరావతి డెవలప్మెంట్ అసోసియేషన్ పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేసుకోవాలని సీఎం రాజధాని రైతులకు సూచించారు. అమరావతి రైతుల అభివృద్ధికి, భవిష్యత్తుకు తాను పూర్తి కమిట్మెంట్తో ఉన్నానని అన్నారు. మొత్తంగా చంద్రబాబుతో సమావేశం పట్ల రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇటు అమరావతిపై ప్రభుత్వం భవిష్యత్తు ప్లాన్ ఎంటో కూడా స్పష్టం మైంది.