
ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిన మహానేత వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా సేవలు చిరస్మరణీయమని పలువురు నాయకులు పేర్కొన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని దీనబంధు కాలనీ చౌరస్తాలో వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ప్రజలకు అందించిన సేవలను నాయకులు, కార్యకర్తలు స్మరించుకున్నారు.ముఖ్యంగా పేద కుటుంబాలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వైఎస్సార్ పాలనలో కీలక మైలురాయిగా నిలిచిందని వారు పేర్కొన్నారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న అనేక పేద కుటుంబాలకు ఉచిత వైద్యం అందించి, ఆర్థిక భారం నుంచి వారికి ఉపశమనం కల్పించడంలో ఆరోగ్యశ్రీ ఎంతో ఉపయోగపడిందన్నారు.అలాగే రైతుల సంక్షేమానికి ఉచిత విద్యుత్, రైతు రుణాల మాఫీ, జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం, పేదలకు ఇళ్ల నిర్మాణం, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యార్థులకు విద్యా అవకాశాల విస్తరణ వంటి పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వైఎస్సార్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తుచేశారు. పేదల జీవితాల్లో ప్రత్యక్షంగా మార్పు తీసుకురావడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు నేటికీ ప్రజల మదిలో నిలిచిపోయాయని అన్నారు.
ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు చేరువ చేసిన నాయకుడిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఆయన మరణించి సంవత్సరాలు గడిచినా ప్రజల గుండెల్లో ఆయనపై ఉన్న అభిమానం ఏమాత్రం తగ్గలేదని నాయకులు అన్నారు.ఈ కార్యక్రమంలో అశోక్ దుత్తలూరి భూషణం దశరథ్, కొండారెడ్డి, యాదగిరి, శ్రీనివాస్, కృష్ణ, మందుల శివ, పరశురాం, మల్లేష్ తదితరులు పాల్గొని వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు.