
పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 11, అశ్వాపురం: అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలోని పశు వైద్యశాలను అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మరియు ఉప సర్పంచ్ తుళ్లూరి ప్రకాశరావు సందర్శించారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారి ఎస్కే రూబీనా ఫర్హానా తో సర్పంచ్, ఉప సర్పంచ్ మాట్లాడి పశు వైద్యశాలలో అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు మరియు పశువుల సంరక్షణకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో పశువులకు నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాలు, పశువులకు అందిస్తున్న వివిధ రకాల వైద్య సేవలు, అలాగే గ్రామంలోని కుక్కలకు అవసరమైన వ్యాక్సినేషన్ కార్యక్రమాల గురించి వైద్యాధికారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పశు వైద్యాధికారి మాట్లాడుతూ పశు వైద్యశాలలోని మోటార్ పనిచేయకపోవడంతో త్రాగునీటి సమస్య ఏర్పడిందని, ఆసుపత్రి భవనానికి కొన్ని మరమ్మతులు అవసరమని తెలిపారు. అలాగే పశు వైద్యశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం అవసరముందని సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. అదే విధంగా ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు గ్రామపంచాయతీ తరఫున వారానికి రెండుసార్లు పారిశుధ్య పనులు చేపట్టాలని కోరారు.దీనిపై స్పందించిన గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మాట్లాడుతూ, పశు వైద్యశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేలా గ్రామపంచాయతీ సిబ్బందితో క్రమం తప్పకుండా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.అలాగే పశు వైద్యశాలలోని మోటార్‌ను మరమ్మతు చేయించి తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పశు వైద్యశాల భవనం మరమ్మతులు, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రహరీ గోడ నిర్మాణానికి సంబంధించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వీవీజీ/రాంజీ పథకం ద్వారా పనులను చేపట్టే విధంగా కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు.గ్రామంలో పశుసంపదకు మెరుగైన వైద్య సేవలు అందించడం, సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టడం, పశువులకు వ్యాక్సినేషన్ అందించడం, పశు వైద్యశాలలో అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం తమ ప్రాధాన్యత అని సర్పంచ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి ఎస్కే రూబీనా ఫర్హానా, పశు వైద్యశాల సిబ్బంది పి.రాజబాబు, గ్రామపంచాయతీ పంచాయతీ కార్యదర్శి యాకుబ్, వార్డు సభ్యులు నూకల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.