
-నారాయణపేట జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి..
-పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించాలి..
బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జి. బలరాం రెడ్డి.. :
పయనించే సూర్యుడు జులై 14మక్తల్ : ఒకవైపు వర్షాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నప్పటికీ ఇప్పటికీ సరైన వర్షాలు కురవక రైతులు తీవ్రంగా నష్టపోతుంటే, మరోవైపు విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తీవ్రమైన కరెంటు కోతలు విధిస్తూ రైతులను అధోగతిపాలు చేస్తున్నారని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జి. బలరాం రెడ్డి అన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నారాయణపేట జిల్లా వ్యాప్తంగా రైతులు సాగుచేసిన పత్తి, కంది, ఆముదం పంటలు ఎండిపోయి రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. దీనికి తోడు కరెంటు కోతలు అధికమై రోజులు కనీసం 8 నుంచి 10 గంటలకు కూడా కరెంటు సరఫరా లేకపోవడంతో బోరుబావుల కింద సాగుచేసిన పంటలు సైతం ఎండిపోయే దుస్థితి నెలకొందన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోయి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టింపు లేకుండా ఉండడం దుర్మార్గమన్నారు. తక్షణమే నారాయణపేట జిల్లాను కరువు ప్రభావిత జిల్లాగా ప్రకటించి రైతులకు ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే కరెంటు కోతలు లేకుండా రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును అందించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బిజెపి ఆధ్వర్యంలో రైతుల పక్షాన పోరాడుతామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.