
పయనించే సూర్యుడు న్యూస్ : ఓ ఆటో డ్రైవర్‌పై ఎమ్మెల్యే చేయి చేసుకున్నారు. ఆగ్రహంతో ఆటో డ్రైవర్ చెంపపై లాగిపెట్టి కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సదరు ఎమ్మెల్యే ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ షాకింగ్ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..మహారాష్ట్రలోని ముంబైలో ఘట్కోపర్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. ఈ రూట్లో బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానికులతో కలిసి నిరసనలో ఆయన పాల్గొన్నారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఇంతలో ఓ ఆటో డ్రైవర్ ట్రాఫిక్‌ను ఉల్లంఘించడాన్ని ఎమ్మెల్యే పరాగ్ షా గమనించారు. దీంతో ఆయనకు పిచ్చి పిచ్చిగా కోపం వచ్చేసింది. రాంగ్ రూట్లో వెళ్లడంపై ఆటో డ్రైవర్‌ను ఎమ్మెల్యే నిలదీశారు. ఈ సందర్భంగా వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అందరూ చూస్తుండగా రెచ్చిపోయిన ఎమ్మెల్యే పరాగ్ షా ఆటో డ్రైవర్ చెంపపై లాగిపెట్టి కొట్టారు. చుట్టూ జనాలు పెద్ద సంఖ్యలో గుమికూడటంతో ఈ వ్యవహారం కాస్తా స్థానికంగా చర్చకు దారి తీసింది. పైగా అక్కడే ఉన్న కొందరు జనాలు మొత్తం వ్యవహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. దీంతో సదరు ఎమ్మెల్యే తీరును నెటిజన్లు దుయ్యబట్టారు.ఆటో డ్రైవర్‌ను చెంపదెబ్బ కొట్టిన సంఘటనపై ఎమ్మెల్యే పరాగ్ షా స్పందిస్తూ.. నేరం అంగీకరించారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపాడని, పదే పదే హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో కోపంతో చేయి చేసుకున్నానని అన్నారు. ఆటోరిక్షా చాలా వేగంగా రాంగ్ రూట్లో వస్తోందని షా అన్నారు. అతను వెళ్తున్న వేగం ఎక్స్‌ప్రెస్‌వేపై ఎవరో రేసింగ్ కారు నడుపుతున్నట్లు ఉందని, అతన్ని ఆపమని సిగ్నల్ ఇచ్చాము. కానీ అతను వినడానికి సిద్ధంగా లేడని ఎమ్మెల్యే అన్నారు. రిక్షాలో ఉన్న మహిళా ప్రయాణీకురాలు కూడా డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్‌పై ఫిర్యాదు చేసిందని, పదే పదే వేగాన్ని తగ్గించమని కోరినప్పటికీ పట్టించుకోలేదని షా తెలిపారు. అయితే ఈ ఘటనలో డ్రైవర్ పై దాడి చేయకుండా ఉండాల్సిందని ఎమ్మెల్యే అంగీకరించారు. చివరికి డ్రైవర్ కు చలాన్ జారీ చేసి హెచ్చరికతో వదిలిపెట్టారని ఆయన అన్నారు.