ఆడపిల్ల పుట్టడం అదృష్టం…. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
పయనించే సూర్యుడు. మార్చి 27. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
ఆడపిల్ల పుట్టిన ప్రతి ఇంటికి వెళ్లి స్వీట్ బాక్స్ ఇచ్చి శుభాకాంక్షలు అందజేయనున్న జిల్లా అధికారులు అమ్మాయి పుట్టడం అదృష్టమనే భావన పెంచేలా కృషి
మా పాప - మా ఇంటి మణిదీపం కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్ తల్లాడ : ఆడపిల్ల పుట్టడం అదృష్టమని, ఇంటిలో ఆడపిల్ల పుడితే స్వీట్ బాక్స్ అందించి శుభాకాంక్షలు తెలిపే విధంగా ఖమ్మం జిల్లాలో మా పాప - మా ఇంటి మణిదీపం కార్యక్రమాన్ని నేడు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం తల్లాడ మండలం రామచంద్రపురం గ్రామంలో మా పాప - మా ఇంటి మణిదీపం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ లాంఛనంగా ప్రారంభించారు. రామచంద్రాపురం గ్రామంలోని బానోతు కృష్ణవేణి- భరత్ నాయక్ దంపతులకు 2025 మార్చి 1న ఆడపిల్ల జన్మించిందని, ఈ సందర్భంగా ఈ కుటుంబానికి జిల్లా కలెక్టర్ స్వీట్ బాక్స్, ఫ్రూట్స్, సర్టిఫికెట్ అందించి శాలువాతో సన్మానించారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ భగవంతుడు అవకాశం ఇస్తే తనకు ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటానని, ఆడపిల్లలు చూపించే ప్రేమ మగ పిల్లలు చూపరని కలెక్టర్ తెలిపారు. చదువులలో అబ్బాయిల కంటే అమ్మాయిలు చాలా బాగా రాణిస్తున్నారని, ప్రతి తరగతిలో మొదటి మూడు స్థానాలలో అమ్మాయిలే ఉంటున్నారని కలెక్టర్ తెలిపారు. మన ఇంట్లో పుట్టిన ఆడపిల్లలకు మగ పిల్లలతో సమానంగా విద్య, వ్యాపార, ఆస్తి, అవకాశాలలో భాగం కల్పించాలని అన్నారు. అబ్బాయిలతో సమానంగా ఆడపిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, మంచి విద్య, ఇతర ప్రాంతాలకు వెళ్లి ఏదైనా సాధించేందుకు అవకాశం, ప్రోత్సాహకాలు అందజేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అమ్మాయి ఆశించిన మేరకు చదువుకున్న తర్వాత ఉద్యోగం లేదా వ్యాపారంలో స్థిరపడి సొంత ఆదాయ వనరులు సంపాదించుకున్న తర్వాత మాత్రమే పెళ్ళి గురించి ఆలోచించాలని, ఆడపిల్లల భావాలకు గౌరవం ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. సునీతా విలియమ్స్ అనే మహిళ విజయవంతంగా అంతరిక్షంలో ఉండి వచ్చారని, అంతరిక్షంలో మహిళలు అడుగుపెట్టిన నేటి హైటెక్ యుగంలోనూ కొంత మంది ఆడపిల్లలపై వివక్ష చూపడం దురదృష్టకరమని అన్నారు. స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం సమాజంలో తొలగించాలని, అమ్మాయి పుడితే అదృష్టంగా భావించాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా జిల్లా అధికారులు వెళ్లి తల్లిదండ్రులకు స్వీట్ బాక్స్ ఇచ్చి, మంచి సందేశం అందించాలని, మహాలక్ష్మి ఇంట్లో పుట్టినందుకు శుభాకాంక్షలు తెలిపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నేడు ప్రారంభిస్తున్నామని అన్నారు. ప్రతి రంగంలో మహిళలు రాణించి సత్తా చాటుతున్నారని అన్నారు. ఆడపిల్ల పుట్టిన వారి ఇంటికి అధికారులు వెళ్లి స్వీట్ బాక్స్ అందజేసి, ఇంట్లో అమ్మాయి పుడితే అదృష్టం అనే భావన ప్రజల్లోకి బలంగా వెళ్లేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం బానోతు కృష్ణవేణి, అత్తగారైన బాణోత్ ఇందిరా మాట్లాడుతూ, ఈరోజు మాకు చిరస్మరణీయమైన రోజు అని, జిల్లా కలెక్టర్ గారు మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని ఆశీర్వదించడం గొప్ప అనుభూతి అని, జిల్లా కలెక్టర్ చెప్పిన విధంగా అమ్మాయిని మంచిగా చదివించి ఉన్నత స్థానానికి ఎదిగేలా కృషి చేస్తామని, మా అమ్మాయి పెద్దైన తర్వాత కలెక్టర్ గారు ఇచ్చిన సర్టిఫికెట్ చూపెట్టి ఈనాటి విషయాలు తెలుపుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కే. రామ్ గోపాల్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి అయిన జిల్లా మత్స్య శాఖ అధికారి శివ ప్రసాద్, డి.హెచ్.ఈ.డబ్ల్యూ సమ్రీన్, తహసిల్దార్, గ్రామస్తులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.