
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: ఆర్జీయూకేటీ - త్రిబుల్ ఐటీ బాసర ప్రాంగణంలో పీయూసీ-I నూతన విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో, స్ఫూర్తిదాయకంగా సాగింది. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర మాజీ డీజీపీ, మాజీ టీఎస్పీఎస్సీ చైర్మన్ డాక్టర్ మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల్లో సరికొత్త చైతన్యాన్ని నింపారు.విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ మహేందర్ రెడ్డి ప్రసంగిస్తూ… గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల్లో అపారమైన ప్రతిభాపాటవాలు దాగి ఉన్నాయని కొనియాడారు. ఆ ప్రతిభకు సరైన దిశ చూపిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని స్పష్టం చేశారు. జీవితంలో అత్యున్నత విజయాన్ని సాధించడానికి నిరంతర అధ్యయనం, కఠోర క్రమశిక్షణ, సమయపాలన, సానుకూల దృక్పథం అత్యంత ప్రధానమైన శక్తులని ఉద్బోధించారు.కేవలం పాఠ్యపుస్తకాల జ్ఞానానికే పరిమితం కాకుండా, మారుతున్న జగత్తుకు అనుగుణంగా కమ్యూనికేషన్ నైపుణ్యాలు, భాషా ప్రావీణ్యం, విశేష సబ్జెక్టు అవగాహన పెంపొందించుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రతి అంశంపైనా నిరంతర జిజ్ఞాస , విమర్శనాత్మక ఆలోచనా ధోరణి అలవర్చుకున్నప్పుడే విజయతీరాలకు చేరడం సులువవుతుందని వివరించారు.తన విద్యార్థి దశలో, లక్ష్యం వైపు సాగుతున్న ప్రయాణంలో ఎదుర్కొన్న అనుభవాలు, కఠోర శ్రమ, పట్టుదల, నైతిక విలువలతో కూడిన జీవన శైలి తనను ఈ ఉన్నత స్థానానికి చేర్చాయని గుర్తు చేసుకున్నారు. "ప్రతి ఒక్కరూ ఆకాశమంత పెద్ద కలలు కనాలి, వాటిని నిజం చేసుకునేందుకు ప్రతిరోజూ ప్రణాళికాబద్ధంగా శ్రమించాలి" అని దిశానిర్దేశం చేశారు. వేగంగా మారుతున్న సాంకేతిక యుగంలో నూతన పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ఉత్కృష్ట వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. విశ్వవిద్యాలయ గౌరవ ఉపకులపతి ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్ మాట్లాడుతూ… పీయూసీ-I ఓరియంటేషన్ కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు నాయకత్వ లక్షణాలు, జీవన నైపుణ్యాలను పెంపొందించే గొప్ప లక్ష్యంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. డాక్టర్ మహేందర్ రెడ్డి వంటి విశిష్ట వ్యక్తుల జీవిత అనుభవాలు విద్యార్థుల భవిష్యత్తుకు నిరంతర స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.ఈ రోజంతా సభ ప్రాంగణం అంతా ప్రసంగాన్ని అత్యంత ఆసక్తిగా ఆలకిస్తున్న విద్యార్థులతో నిండి పోయింది. ఈ వేదికపై విశ్వవిద్యాలయ అధికారులు, డీన్లు, అధ్యాపకులు, పరిపాలనాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని పీయూసీ-I ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ 'డాక్టర్ గుజ్జరి శంకర్' అత్యంత సమర్థవంతంగా సమన్వయం చేశారు.