( ఏఐఎస్ఎఫ్ ) అఖిల భారత విద్యార్థి సమైక్య
రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్
మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి
ఆదివాసీల జీవించే స్వేచ్ఛను కాపాడాలి
( పయనించే సూర్యుడు మే 02 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జి నరేందర్ నాయక్ )
ఆపరే షన్ కగార్ పేరుతో కేంద్రప్రభుత్వ బలగాలు మావోయిస్టులపై హత్యాకాండ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆపరేషన్ కగారు వెంటనే నిలిపివే యాలని ఎఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛత్తీస్ గఢ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బలగాలను మోహరించి మావోయిస్టు పార్టీని అంతం చేయాలని కేంద్రం ప్రకటించిందని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చివరి మావోయిస్టును చంపేదాకా వదిలిపెట్టబోమని మాట్లాడటం అప్రజాస్వామికమని ఆయన అన్నారు. సైన్యం తమ సొంత ఆస్తిగా కేంద్ర హోం శాఖ మంత్రి మాట్లాడటాన్ని ఖండిస్తున్నామన్నారు. మావోయిస్టు పార్టీ ప్రతినిధులు శాంతి చర్చలకు పిలవాలని కోరుతుంటే, వారిని గౌరవించి పిలువకుండా తుదిముట్టించే దాకా వదలబోమనటం దుర్మార్గమన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ అడవుల్లోని ఆదివాసీలను నిర్మూలించే పద్ధతిని మోడీ సర్కారు కొనసాగిస్తున్నదన్నారు. సాయుధలైన మావోయిస్టులకు, పోలీసు బలగాలకు మధ్య జరుగుతున్న యుద్ధంలా అదిలేదనీ, బలగాలు అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేసి వారిని అడవుల నుంచి వెళ్లగొట్టేలా ఉందన్నారు. అక్కడ మానవ, ఆదివాసీ, గిరిజన హక్కులను హరణ జరుగుతున్నదని, ఛత్తీస్ గఢ్ అటవీ ప్రాంతంలోని విలువైన స్వదేశీ ఖనిజ సంపదను, విదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర దాని వెనుక ఉన్నదని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని,ఇప్పటికే శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించిన నేపథ్యంలో ఆ మేరకు స్పందించాలని ఆయన కోరారు. లేనిపక్షం లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.