పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 1, జగ్గయ్యపేట ప్రతినిధి భూక్యా కవిత :
ఆరోగ్యంగా ఉన్నప్పుడే విద్య మీద మనసు లగ్నం చేయగలుగుతారని కర్లపాటి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సామాజికవేత్త కర్లపాటి వెంకట శ్రీనివాసరావు అన్నారు. శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గత నాలుగు సంవత్సరాలుగా తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాల ప్రాజెక్ట్ సహకారంతో జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న బాలికలకు రి యూజబుల్ (పునర్ వినియోగించే ) శానిటరీ ప్యాడ్స్ ను అందజేస్తున్నామని తెలిపారు. అనంతరం 200 మంది బాలికలకు షుమారు 70 వేల రూపాయల విలువైన ప్యాడ్స్ ని అందజేశారు.కార్యక్రమానికి హాజరైన పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు షేక్ నజీమూన్ మాట్లాడుతూ స్త్రీ జీవితంలో రుతుక్రమం సాధారణమైన ప్రక్రియ అని, ఆ సమయంలో తీసుకోవలసిన పలు జాగ్రత్తలు విశదీకరించారు.ఐసిడిఎస్ సూపర్వైజర్ శారద కిషోర దశలో బాలికలు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలు తెలియజేశారు.ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి మాధవి లత సభకు అధ్యక్షత వహించగా, పాఠశాల మహిళా సిబ్బంది, ట్రస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.