
పయనించే సూర్యుడు జూన్ 21 (సూళ్లూరుపేట నియోజక వర్గ0 రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట విద్య హక్కు చట్టం (ఆర్టీఈ) ప్రకారం ఉచిత విద్య పొందుతున్న చిన్నారుల పట్ల కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు సూళ్లూరుపేటలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆర్టీఈ కింద ప్రవేశాలు పొందిన విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు అందించడంలో ఆలస్యం చేస్తూ, ముందుగా డొనేషన్లు చెల్లించిన విద్యార్థులకే ప్రాధాన్యత ఇస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. డబ్బులు చెల్లించి యూనిఫాం, పుస్తకాలు ఇవ్వాలని కోరినా నిరాకరిస్తున్నారని వాపోతున్నారు. దీంతో చిన్నారులు తోటి విద్యార్థుల ముందు అవమానానికి గురవుతూ, వారి మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులందరినీ సమానంగా చూడాల్సిన విద్యాసంస్థలు ఇలా వ్యవహరించడం బాధాకరమని అంటున్నారు. మరోవైపు పట్టణంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఎల్కేజీ నుంచే రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు, ముఖ్యంగా ఎంఈఓ కార్యాలయం ఎందుకు స్పందించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసు కుంటున్నారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్య హక్కు ప్రతి చిన్నారికి సమానంగా అందేలా, ఆర్టీఈ విద్యార్థులపై ఎలాంటి వివక్ష లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చిన్నారుల గౌరవం, హక్కులు కాపాడేలా విద్యాశాఖ వెంటనే జోక్యం చేసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.