ఖమ్మం: నేటి సమాజంలో మనం చూసేవన్నీ ఒక్కపుడు ఆలోచనలతోనే ఆవిష్కరణలు అయ్యాయని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం కలెక్టర్, స్థానిక యస్.బి.ఐ.టి. కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి ఐడియాథాన్ కు ముఖ్య అతిధిగా పాల్గొని, విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. గతంలో వనరుల కొరత వల్ల ఆలోచనలు అమలుకు నోచుకోలేకపోయాయని, ఇపుడు ఆ పరిస్థితులు లేవని, ఇంటర్నెట్ యుగంలో ప్రపంచం ఓ కుగ్రామంలా మారిందని అన్నారు. వచ్చిన ఆలోచన పై పట్టుదలతో అడుగులు వేస్తే విజయం సిద్దిస్తుందని కలెక్టర్ తెలిపారు. మానవ మేధస్సు ఓ కర్మాగారమని, ఆలోచనలు అందునుంచి ఉద్భవించే అద్భుతాలని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎస్.బి.ఐ.టి. కళాశాల ఛైర్మన్ గుండాల కృష్ణ మాట్లాడుతూ, ఓ అద్భుతమైన ఆలోచన ప్రపంచ గతినే మారుస్తుందని, ఇంటర్నెట్ అందుకు సాక్ష్యం అని గుర్తుచేసారు. ఈ తరం విద్యార్థులు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, రానున్న రోజులలో అద్భుతాలు సృష్టించగలరని ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. తెలంగాణా అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి (టాస్క్) వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ఐడియాథాన్ స్పందనతో సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే ఎన్నో ఆలోచనలు పుట్టుకొచ్చాయని టాస్క్ రిలేషన్ షిప్ మేనేజర్ పి. దినేష్ తెలిపారు. పర్యావరణం, ఆరోగ్యం, విద్య, జీవనవిధానం మరియు వ్యవసాయ రంగాల పై వివిధ కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన ప్రజెంటేషన్స్ భావితరాలకు మార్గదర్శిగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. జిల్లాస్థాయిలో 10 కళాశాలలు పాల్గొనగా, 313 ఆలోచనలను పంపారని, అందులో 56 ఎంపిక చేయగా 186 మంది విద్యార్థులు పాల్గొనినట్లు పాజెక్ట్ మేనేజర్ బి. బాలు ప్రవరాఖ్య తెలిపారు. జిల్లాస్థాయిలో విజయం సాధించిన టీమ్ ని రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతారని వారు తెలిపారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా. జి. ధాత్రి, ప్రిన్సిపల్ డా. జి. రాజ్ కుమార్ పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికేట్స్, బహుమతులు అందజేసారు. ఈ కార్యక్రమంలో టాస్క్ రిలేషన్ షిప్ మేనేజర్ పి. దినేష్, ప్రాజెక్ట్ మేనేజర్ బి. బాలుప్రవరాఖ్య, హెడొల్ద్ హై ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ యన్. అర్జున్, గేమిఫైంగ్ ఎడ్యుకేషన్ ఫౌండర్ శ్రీరామ్ సంకీర్త్, కళాశాల అకడమిక్ డైరెక్టర్స్ గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాసరావు, డా. ఎ.వి.వి. శివ ప్రసాద్, డా. జె. రవీంద్రబాబు, డా. యస్. శ్రీనివాసరావు, హెచ్.ఒ.డి.లు, ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెల్ ఇంచార్జి డా. స్పూర్తి, అశ్వని, హరిణి, టి.పి.ఒ. యన్. సవిత, కోఆర్డినేటర్ జి. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.