నెలకు 30వేలు నుండి సంవత్సరానికి ..కోట్లలో ఈఎస్ఐ కి కార్మికుల ద్వారా కంట్రిబ్యూషన్ చెల్లింపు... Esi డిస్పెన్సరీ ద్వారా పూర్తిస్థాయిలో అందని వైద్య సేవలు... అరకొరగా అందుబాటులో మెడిసిన్... 24 గంటలు వైద్య సేవలు అందించాలని, అంబులెన్స్ అందుబాటులో ఉండాలని కార్మికుల డిమాండ్...
పయనించే సూర్యుడు, జనవరి 29,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కర్మాగారాలలో పనిచేస్తున్న కార్మికులందరికీ బూర్గంపాడు మండలం సారపాక లో ఉన్న ఈఎస్ఐ డిస్పెన్సరీ దిక్కు. చిన్నపాటి కర్మ గారాలలో, పెట్రోల్ బంకు సినిమా ,ధియేటర్లు ఇతర కుటీర పరిశ్రమలలో పనిచేసే వారందరికీ ఈఎస్ఐ ద్వారానే వైద్య సేవలు. సంవత్సరాల గడుస్తున్న ఆసుపత్రి నిర్మాణం చేయలేని పరిస్థితి... ఎన్నో సంవత్సరాలు గడుస్తున్న ఈ ప్రాంతంలో ఈఎస్ఐ డిస్పెన్సరీ అద్దె గదులలో ఉంటూ పలుమార్లు మారుతూ నామమాత్రపు వైద్య సేవలు మాత్రమే అందుతున్నాయని కార్మికులు ముక్తకంఠంతో తెలియజేస్తూ ఉన్నారు.24 గంటలు అంబులెన్స్ సౌకర్యం, వైద్య సేవలు, ఆపరేషన్స్, ఇతర మెరుగైన వైద్య సేవలు ఈఎస్ఐ కార్పొరేట్ హాస్పిటల్ ద్వారానే చేయాలని అందుకు వెంటనే ఈఎస్ఐ అధినాతన ఆసుపత్రిని నిర్మాణం చేయాలని కార్మికులు కోరుతున్నారు, అందుకు సంబంధించి పలుమార్లు ఈఎస్ఐ యాజమాన్యానికి వినతి పత్రాలు సమర్పించడం తోపాటు ఇటీవల కాలంలో ఐఏఎస్ ఆఫీసర్ సారపాక ఈఎస్ఐ డిస్పెన్సరీ ని సందర్శించిన నేపథ్యంలో కార్మిక సంఘాల నేతలు, కార్మికులు పలువురు కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేయాలని ఆయనకు సమస్యలతో కూడిన వినతి పత్రాలను కూడా అందజేశారు. ఎన్నో సంవత్సరాల గడుస్తున్న ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం జరగటం లేదని వెంటనే ఆసుపత్రి నిర్మాణం చేయాలని డిమాండు వినిపించారు.
పలువురి వాదన ఇలా ఉంది...
ఈ ప్రాంతం 170 యాక్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ ఆసుపత్రి నిర్మాణం చేయాలంటే అనేక ఇబ్బందులు, అనుమతులు పొందాలంటే చాలా సమయం పడుతుందని, ఇక్కడ స్థలం ఇవ్వాలన్న రెవెన్యూ శాఖ చొరవ చూపించాలని గ్రామపంచాయతీ అధికారులు దానిపై సర్వే నిర్వహించాల్సిన అవసరం ఉందని పలువురు తెలియజేస్తూ ఉన్నారు.
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పలువురు కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు, దాతలు ,స్వచ్ఛంద సంస్థలు, అందరూ కలిసి ఏకతాటిపై వచ్చి ఒక మంచి ప్రాంతంలో రిజిస్ట్రేషన్ భూమిని గాని లేదా సాధారణ భూమిని గాని కొనుగోలు చేసి ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి ఇవ్వగలిగితే అక్కడ అత్యంత నైపుణ్యం కలిగినటువంటి ఎక్కువ బెడ్స్ తో పాటు డాక్టర్లు తోపాటు అధునాతన వైద్య సేవలు ఈఎస్ఐ ఆసుపత్రి ద్వారా కార్మికులకు కార్మిక కుటుంబాలకు అందజేయొచ్చని సూచనలు చేస్తూ ఉన్నారు.
రిజిస్ట్రేషన్ భూమిలో ఆసుపత్రి నిర్మాణం త్వరగా అయ్యే అవకాశాలు ఉంటాయని అందుకు అందరు సహకారం అందిస్తే ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం సాధ్యమేనని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న అఖిలపక్ష నేతలు దాతలు ముందుకు వచ్చి అందరిని సమావేశం ద్వారా విషయం తెలియజేసి ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి భూమిని రెడీ చేసేందుకు కమిటీ వేయాలని నేతలు ఈ ప్రాంత ఎమ్మెల్యే చొరవ చూపించాలని పలువురు సూచనలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు.
ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేయాలి...
ప్రతి నెలకు ప్రతి సంవత్సరానికి కార్మికుల ద్వారా కోట్ల రూపాయలు కార్మికుల జీతభత్యాలు నుండి అందుకుంటున్న ఈఎస్ఐ యాజమాన్యమే ఈ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ భూమి గానీ సాధారణ భూమి గాని తీసుకొని ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ వినిపిస్తూ ఉంది.ఎన్నో సంవత్సరాలుగా కార్మికులు తమ రక్తాన్ని ధారబోసి కర్మాగారాల అభివృద్ధికి తోడ్పడుతున్న కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించుట కోసం అన్ని యాజమాన్యాలు, కుటీర పరిశ్రమల సంబంధిత యజమానులు ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి తమ వంతు సహకారాన్ని అందించి భూమి కొనుగోలు చేసి లేదా భూమి కేటాయింపులో తమ వంతు సహకారాన్ని అందించి ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేయాలని కార్మికుల ద్వారా ఈ ప్రాంత వాసులు ద్వారా గట్టి డిమాండ్ వినిపిస్తూ ఉంది.అలా ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం ఈ సంవత్సరం మొదలు పెట్టకపోతే రాబోయే రోజుల్లో కార్మికుల ద్వారా ఈ ప్రాంతవాసులు ద్వారా వ్యతిరేకత ఓ భూకంపం మాదిరిగా ఆందోళన వ్యక్తం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఎందుకంటే సాధారణ కార్మికుడు తన చాలీచాలని జీతభత్యాలతో కుటుంబ పోషనే కష్టంగా ఉంది ,రోజు రోజుకి పెరుగుతున్న ధరల నేపథ్యంలో కుటుంబం పోషణ అంతంత మాత్రం గానేఉంటుంది. వైద్యం చేయించుకోవాలంటే కేవలం ఈఎస్ఐ డిస్పెన్సరీ మాత్రమే దిక్కు ఇక్కడ అందరి మెరుగైన వైద్య సేవలు లేకపోవడంతో హైదరాబాద్ లేదా వరంగల్ కు వెళ్లి చేయించుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఈ ప్రాంత వాసులకు ఉంది. సమీపంలో ఉన్న భద్రాచలం లేదా కొత్తగూడెం ఖమ్మం మెరుగైన వైద్య సేవలు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లాలంటే అక్కడ డబ్బులు చెల్లించే పరిస్థితి లేక కొందరు ఆర్ఎంపీలు దగ్గర లేదా ఈఎస్ఐ నామమాత్రపు వైద్య సేవలను అందుకోవాల్సిన పరిస్థితి కార్మికులకు కార్మిక కుటుంబాలకు ఉంది.
కాంట్రాక్ట్ కార్మికులు సాధారణ కార్మికులు తమ రక్తాన్ని ధారపోసి కర్మాగారాల అభివృద్ధి కోసం పాటుపడుతూ నిత్యం విధులు నిర్వహించే కార్మికుల కోసం ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందుకు అన్ని వర్గాలు కూడా సహకారం అందించాలనే వాదన వినిపిస్తూ ఉంది. ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి యాజమాన్యాలు ఎందుకు సహకరించడం లేదు నాయకులు ఎందుకు పట్టు పట్టి ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కోసం పనిచేయడం లేదని ప్రశ్నలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా ఈసారి బూర్గంపాడు మండలంలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం జరగాలని లేనిపక్షంలో ఆందోళన బాట పట్టే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఆత్మ విమర్శ చేసుకుని ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి అది భూమి కానీ మరేదైనా కానీ అనుమతులు కానీ ఇవన్నీ కూడా రావడానికి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా కాంట్రాక్టు కార్మికులకు మేలు చేసే విధంగా యాజమాన్యాలతో పోట్లాడి ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేసేందుకు అందరూ కూడా సహకారం అందించాలని నడుం బిగించాలని కార్మిక లోకం కోరుతుంది. ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి నాంది పలికేది ఎవరో వేచి చూద్దాం...