పయనించే సూర్యుడు. మార్చి 26. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
మనం ఎన్నుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగడమే లక్ష్యంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం తనికెళ్ళలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలలో జిల్లా ఉపాధి అధికారి కార్యాలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మహిళల పట్ల చిన్న చూపు ఉన్న దశలో ఎలాంటి చర్చ లేకుండానే మహిళలకు ఓటు హక్కును మన భారత దేశం కల్పించిందని అన్నారు. ఆర్థికంగా బలోపేతం కాక పోవడమే మహిళల పట్ల ఉన్న వివక్షకు కారణమని గమనించిన ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం అమలు ప్రారంభించిందని అన్నారు. చదువులో బాలుర కంటే అధికంగా బాలికలు రాణిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ఆడపిల్ల పుడితే గర్వ కారణం అని చాటి చెప్పేందుకు జిల్లాలో గర్ల్ ప్రైడ్* అనే వినూత్న కార్యక్రమం ప్రారంభిస్తున్నామని, జిల్లాలో ఎక్కడ ఆడపిల్ల no పుట్టినా జిల్లా అధికారి స్వీట్ బాక్స్ తో వెళ్ళి ఆ కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం సంక్షేమ హాస్టల్లో ఉన్న బాలికలకు అధిక బాధ్యత ఉందని, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునేందుకు చాలామంది ఎదురు చూస్తున్నారని, మీరు రాణించి అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకొని ఉన్నత స్థాయికి చేరుకొని నలుగురికి ఆదర్శం కావాలని కలెక్టర్ తెలిపారు. గత తరాల మహిళలకు చదువుకునేందుకు అవకాశాలు లభించలేదని, తన అమ్మమ్మ పెళ్లి తర్వాత చదువుకున్నారని, ప్రస్తుతం తమ కుటుంబం అంతా చదువుకొని మంచి స్థానంలో ఉండేందుకు అమ్మమ్మ కారణమని, తన భార్య కూడా యూపిఎస్సి రాసి ఢిల్లీలో ఉన్నత బాధ్యతలో ఉన్నారని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల సమయంలో మహిళలకు ధైర్యం కల్పించి ఎన్నికల విధులు కేటాయిస్తే చిత్తశుద్ధితో నిర్వహించి నాలుగు కోట్ల నగదు, మద్యం, బంగారం జప్తు చేసి పారదర్శకంగా ఎన్నికల నిర్వహణలో కీలకమైన పాత్ర పోషించారని కలెక్టర్ తెలిపారు. మహిళలకు చేయలేని పని అంటూ ఏదీ ఉండదని, మనలో ఉన్న సామర్థ్యంపై నమ్మకం పెంచుకోవాలని అన్నారు.
మన జీవితంలో ధైర్యం చేస్తేనే పైకి ఎదుగుతామని, ఇతరుల మాటలు పట్టుకుంటే ఏమీ సాధించలేమని అన్నారు. ప్రతి రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యాన్ని ప్రతి మహిళ నిర్దేశించుకోవాలని అన్నారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ విద్యా సంస్థలలో ఉత్తమమైన ప్రతిభ కలిగిన విద్యార్థినులు ఉన్నారని, వీరికి ప్రైవేట్ కంపెనీలోఅవకాశం కల్పిస్తే తప్పనిసరిగా రాణిస్తారని, కంపెనీలకు విశ్వాసంగా ఉంటూ వాటి అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తారని కలెక్టర్ తెలిపారు.
చిన్నతనంలో 7వ తరగతి చదివే సమయంలో విజయలక్ష్మి మేడం అనే టీచర్ బోధన పద్ధతులు మార్చి తనపై తీసుకున్న శ్రద్ధ కారణంగానే తాను నేడు కలెక్టర్ స్థాయికి చేరుకున్నానని అన్నారు. టీచర్ల విలువ ఎప్పటికీ మర్చిపోవద్దని, వారి శ్రమ ఫలితం వృధా కాకుండా ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత మనం మరో నలుగురికి సహాయం చేయాలని, సమాజంలో ఇతరుల అభివృద్ధికి మనం తోడ్పాటు అందిస్తే వచ్చే సంతృప్తి మరో కార్యక్రమంలో ఉండదని కలెక్టర్ తెలిపారు. జిల్లా ఉపాధి అధికారి ఎన్. మాధవి మాట్లాడుతూ మా పాప మా ఇంటి మణి దీపం అనే కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. చదువు మాత్రమే మనల్ని కాపాడుతుందని, ఈ అంశం ప్రతి మహిళ గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రస్తుత జాబ్ మేళాలో మనకు వచ్చేది మొదటి అవకాశం మాత్రమేనని, హైదరాబాద్, బేంగళూరు వంటి నగరాల్లో అనేక అవకాశాలు వస్తాయని, మన ప్రతిభను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇంటర్వ్యూ ప్రక్రియను పరిశీలించారు. అంతకు ముందు ప్రిన్సిపాల్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గురుకులం నిర్వహణ, అభివృద్ధి పనులపై సమీక్షించారు. జాబ్ మేళాలో వచ్చిన కంపెనీలు, ఉపాధి అవకాశాల గురించి చర్చించారు. జాబ్ మేళాలో ఎంపికైన మహిళలకు ఫైనాన్షియల్ ప్లానింగ్ పై శిక్షణ అందించాలని అన్నారు.
మహిళలకు ఆర్థిక స్వావలంబన చాలా ముఖ్యమని అన్నారు. ప్రస్తుతం వచ్చే జాబ్స్ ఎలా ఉంటాయ్, భవిష్యత్తులో ఎటువంటి అవకాశాలు వస్తాయి, ఎటువంటి కోర్సులు నేర్చుకోవాలి, రాబోయే రోజుల్లో మరో డీగ్రీ ఎలా పొందాలి వంటి అంశాలను ప్లాన్ చేసుకునేలా మహిళలను సిద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు.
గురుకుల హాస్టల్ లో ఫర్నిచర్, బుక్స్ కోసం ప్రతిపాదనలు అందించాలని అన్నారు. మార్చి లోపు గ్రౌండ్ చేసేందుకు ఆస్కారం ఉన్న ప్రతిపాదనలు మాత్రమే పంపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. రజిత, ఉపాద్యాయులు, కంపెనీ ప్రతినిధులు, విద్యార్థినులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.