ప్రభుత్వ వెబ్‌సైట్‌ను ఓపెన్‌లో ఉంచాలి
పేర్ల మార్పులు, చేర్పులు చేసుకునే
వెసులుబాటు కల్పించాలి
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను నాయక్
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 షాద్‌నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)
షాద్ నగర్ : తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉపాధి హామీ చట్టం కింద కొత్త జాబ్కార్డులివ్వకుండా వెబ్‌సైట్‌ను లాక్ చేయడం చట్టం మార్గదర్శకాలకు విరుద్ధమనీ, వెంటనే కొత్త జాబ్ కార్డులను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు షాద్‌నగర్ నియోజకవర్గం కన్వీనర్ శ్రీను నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే గ్రామ పంచాయితీ కార్యాలయంలో జాబ్ కార్డు ఇచ్చేలా, కొత్త పేర్లు చేర్చుకునేలా అవకాశం కల్పించాలని కోరారు. ఉపాధి హామీ చట్ట ప్రకారం 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ జాబ్ కార్డు పొందే హక్కు ఉందనీ, దాన్ని ఇవ్వకుండా నిరాకరించడమంటే ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పించుకోవడమే అవుతుందని విమర్శించారు. 11 ఏండ్ల కాలంలో అనేకమంది ఎదిగొచ్చిన పిల్లలు, కొత్తగా పెండ్లి చేసుకున్న వారు పెద్ద ఎత్తున పెరిగారనీ, వారందరికీ జాబ్ కార్డు ఇవ్వకుండా ఆపడమంటే ఒక తరాన్ని ఉపాధి పనికి దూరం చేయడంతో పాటు రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామి కాకుండా చేయడమే అవుతుందని పేర్కొన్నారు. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వారిని ఆహార భద్రతకు, సామాజిక భద్రతకు, ఆర్థికాభివృద్ధికి దూరంగా నెట్టే చర్యలకు పాలకులు సిద్ధపడటం దుర్మార్గమని పేర్కొన్నారు. దరఖాస్తు పెట్టుకోగానే ఉపాధి జాబ్ కార్డు లబ్ధిదారునికి జారీ చేసే విధంగా ప్రభుత్వ వెబ్‌సైట్‌ను ఓపెన్‌గా ఉంచాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.