
పదవీ విరమణ ఉద్యోగానికే గాని సేవకు కాదు:
ప్రయాణించే సూర్యుడు సెప్టెంబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువును మించిన దైవం లేరుప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో పదవీ విరమణ చేయాల్సి ఉంటుందని, అయితే పదవీ విరమణ అనేది ఉద్యోగానికే గాని వ్యక్తిత్వానికి, సేవాభావానికి కాదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. మనిషి సంపాదించుకున్న మంచి పేరు, చేసిన సేవలు, సమాజంపై చూపిన ప్రభావం శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు.రామచంద్రపురం రూరల్ మండలం నరసాపురపుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉప్పలపాటి మాచిరాజు పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన సన్మాన సభలో మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “గురువును మించిన దైవం లేరు” అని పేర్కొన్నారు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే గురువుల పాత్ర సమాజ నిర్మాణంలో అత్యంత కీలకమని అన్నారు. ఉప్పలపాటి మాచిరాజు కేవలం ప్రధానోపాధ్యాయుడిగానే కాకుండా సామాజిక సేవకుడిగా కూడా విశేష గుర్తింపు పొందారని కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తూ, విద్యా ప్రమాణాల పెంపుదలకు విశేషంగా సేవలందించార ని తెలిపారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు ఆయన చేసిన కృషి ఆదర్శప్రాయమని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులని, వారి సేవలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తాయని అన్నారు.అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబొరేటరీని లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాష్ నారాయణతో కలిసి మంత్రి సుభాష్ ప్రారంభించారు. విద్యార్థులకు ఆధునిక విద్యా సదుపాయాలు అందుబాటులోకి రావడం ఆనందదాయకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, కూటమి పార్టీ నాయకులు,స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.