
పయనించే సూర్యుడుD.7.8.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్.-- డి. సత్యానంద్ TSUTF రాష్ట్ర కార్యదర్శి
ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసమై నేడు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC ) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు ఏర్గట్ల మండలంలోని పలు పాఠశాలల్లో జరిగాయి. ఈ సందర్బంగా TSUTF రాష్ట్ర కార్యదర్శి డి. సత్యానంద్ మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలన్నీ విద్యారంగ సమస్యలేనని, వాటి పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విద్యా శాఖ అధికారుల వైఖరి వల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు క్రమంగా మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా రంగానికి 15% నిధుల కేటాయింపు హామీని విస్మరించారని, నాణ్యమైన విద్య పేరుతో పాఠశాలల కుదింపుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభిస్తున్నామని ఘనంగా ప్రకటించినప్పటికీ కేవలం యుకెజి కే పరిమితం చేశారని, ప్రీప్రైమరీ తరగతులను మధ్యాహ్నం 12.00 గంటల వరకే నడపాలన్నారు కానీ ప్రైవేటు పాఠశాలల్లో సాయంత్రం 4.00 వరకు ప్రీప్రైమరీ తరగతులు నడుస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలలకు పంపితే మధ్యాహ్నం 12.00 తర్వాత పసి పిల్లలను ఎవరు చూసుకుంటారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారని అన్నారు.ప్రాథమిక విద్యకు నష్టదాయకమైన జిఒ 25 ను సవరించాలని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు టీచర్లు, 50 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో తరగతికి ఒక టీచర్ ను నియమించాలని డిమాండ్ చేశారు. నూతన జిల్లాలకు డిఈఒ, రెవెన్యూ డివిజన్ కు ఒక డిప్యూటీ ఇఒ, అన్ని మండలాలకు ఎంఈఒ పోస్టులు మంజూరు చేయాలని,
పిఒ 2018 కి అనుగుణంగా సర్వీసు నిబంధనలు రూపొందించి పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నా పట్టించుకోవడంలేదని యుయస్పిసి నాయకులు విమర్శించారు. ఆగస్టు 15 లోగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని, టెట్ లో సర్వీసు వెయిటేజ్ ఇవ్వాలని, స్పెషల్ టెట్ ను సబ్జెక్టు వారీ పేపర్లతో నిర్వహించాలని, సిపిఎస్ రద్దు చేయాలని, మెమో 57 ప్రకారం 2003 డియస్సీ టీచర్లకు పాత పెన్షన్ వర్తింపజేయాలని, విద్యా శాఖ లో బిసి, గిరిజన గురుకులాల టైంటేబుల్ మార్చాలని, మోడల్ స్కూల్స్ ను, ఎయిడెడ్ స్కూల్స్ ను విద్యాశాఖలో విలీనం చేయాలని, కెజిబివి, యుఆర్ఎస్, సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని, జిఒ 317 బాధితులకు న్యాయం చేయాలని, జిఒ 190 అమలు చేయాలని, 5 వాయిదాల కరువు భత్యం (డిఎ) ను వెంటనే ప్రకటించాలని, పిఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను ప్రతినెల రూ 2000 కోట్ల చొప్పున విడుదల చేయాలని, హెల్త్ కార్డులు పూర్తి స్థాయిలో అమలుకు చొరవ తీసుకోవాలని యుయస్పిసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
పై డిమాండ్ల పరిష్కారానికి దశలవారీ పోరాటాలు నిర్వహించాలని యుయస్పిసి నిర్ణయించింది.ఆమేరకు ఆగస్టు 7న నల్ల బ్యాడ్జీలతో పాఠశాలల్లో భోజన విరామ సమయంలో నిరసనలు, ఆనాటి నుండి పిఆర్సీ ప్రకటించేదాకా ప్రతిరోజూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని యుయస్పిసి పిలుపునిచ్చింది. ఆగస్టు 12,13 తేదీల్లో మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, తహసీల్దార్లకు మెమోరాండంలు, ఆగస్టు 19 నాడు జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని, ఆగస్టు 29న హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే
సెప్టెంబర్ లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వేలాది మంది ఉపాధ్యాయులతో చలో అసెంబ్లీ నిర్వహిస్తామని యుయస్పిసి నాయకులు ప్రకటించారు. అన్ని సంఘాలు ఐక్య పోరాటాలకు కలిసి రావాలని, ఉపాధ్యాయులు అందరూ సంఘాలకు అతీతంగా సమస్యల పరిష్కారం కోసం ఈ పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టి.ఎస్. యూ.టీ.ఎఫ్ మండల అధ్యక్షులు పి. గణేష్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.