
పయనించే సూర్యుడు న్యూస్ :ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేసుకుంటూ వస్తోంది. దీంతో అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో చేతి, కుల వృత్తుల వారికి ఆధునిక యంత్రాలు, పరికరాలు అందించి వారి ఆదాయాన్ని పెంచేందుకు ఆదరణ -3 పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.. లబ్ధిదారుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తూ.. నాణ్యమైన పరికరాలను వారే ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నారు.ఆదరణ-3 పథకంను త్వరలో అమలు చేయబోతున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. ఈ పథకానికి రూ. వెయ్యి కోట్లు వెచ్చించబోతున్నట్లు చెప్పారు. పథకం అమలుపై బీసీ కార్పొరేషన్ చైర్మన్లను, డైరెక్టర్లతో వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు చెప్పారు. అయితే, గతంలో టీడీపీ పథకం అధికారంలో ఉన్న సమయంలో ఆదరణ -2లో రాష్ట్ర స్థాయిలో పరికరాలను ఎంపిక చేసి ఆ తరువాత లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఆదరణ -3లో భాగంగా లబ్ధిదారులే తమకు కావాల్సిన పరికరాలను ఎంపిక చేసుకునే అవకాశంను ప్రభుత్వం కల్పిస్తుంది.రాష్ట్రంలో కుల వృత్తిదారులకు అవసరమయ్యే అత్యాధునిక పరికరాలను ఎంపిక చేసుకునేందుకు ఆదరణ -3 పథకాన్ని ప్రభుత్వం అమలు చేయబోతుంది. అయితే, గతంలో ఆదరణ-2 సమయంలో 90శాతం రాయితీతో పరికరాలను అందజేశారు. మిగిలిన 10శాతం లబ్ధిదారులు చెల్లించాల్సి వచ్చేది. ఆదరణ -3లో కూడా ఇదే విధానం ఉంచనున్నట్లు తెలుస్తోంది. గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలను, పరికరాలను ఇస్తామని గతంలో మంత్రి సవిత ప్రకటించారు. ఒకవేళ బైక్ తీసుకుంటే బైక్ ధర రూ.లక్ష ఉంటే.. అందులో కేవలం రూ.10వేలు కడితే చాలు. అంతేకాదు.. గీత కార్మికులకు మూడు స్లాబులలో లోన్ అందించే సౌకర్యం కూడా ఉంటుంది. రాష్ట్రంలో ఆయా కులవృత్తుల్లో వారు చేసే పనులను బట్టి ఈ పరికరాలను ప్రభుత్వం అందించనుంది.