
పయనించే సూర్యుడు న్యూస్ జూలై 19 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
పోలీస్ శాఖలో విషాదం చోటుచేసుకుంది. కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో డీఎస్పీగా పని చేస్తున్న మహేష్ బాబు అనూహ్యంగా గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం హుజురాబాద్ ఏసిపిగా విధులు నిర్వర్తిస్తున్న మాధవి భర్త అయిన మహేష్ బాబు, హుజురాబాద్‌లో ఆమెను కలవడానికి వచ్చిన సందర్భంలో ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్‌కు గురయ్యారు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారు.మహేష్ బాబు మృతిచెందిన వార్తతో పోలీసులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆయన భార్య మాధవికి ఆత్మీయంగా దగ్గరుండే మహేష్ బాబు మృతి, పోలీస్ శాఖను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.వృత్తి జీవనంలో ఆదర్శ దంపతులు ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన మహేష్ బాబు, అద్భుతమైన సేవలతో సీఐ, ఆపై డీఎస్పీగా పదోన్నతి పొందారు. ఫ్రెండ్లీ పోలీస్‌గా ప్రజల్లో విశేష గుర్తింపు పొందారు. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఆయన సేవలు అందించారు. తన సహృదయతతో సహచరుల మన్ననలు పొందారు.పోలీసు శాఖలో తీవ్ర దిగ్భ్రాంతి డీఎస్పీ మహేష్ బాబు మృతిపై పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, ఇతర ఉన్నతాధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏసిపి మాధవిని పరామర్శించి, ధైర్యం చెప్పారు. పలువురు సహచరులు, సీనియర్ అధికారులు మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
పోలీస్ శాఖలో అత్యంత సమర్థవంతంగా పనిచేసిన ఒక విలక్షణ అధికారిని కోల్పోవడం తీవ్ర విషాదకరమని అందరూ పేర్కొన్నారు. మహేష్ బాబు ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.