
పయనించే సూర్యుడు ఆగస్టు 16(సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట 80వ
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సూళ్లూరుపేట, శ్రీహరికోట, తడ పోలీస్ స్టేషన్లకు చెందిన పలువురు సిబ్బందికి విశిష్ట సేవలకు గుర్తింపుగా పలు పురస్కారాలు లభించాయి. సూళ్లూరుపేట హెడ్ కానిస్టేబుళ్లు కాజా అహ్మద్‌కు సేవా పత్రం, శ్రీరామ్ సత్యనారాయణకు ప్రశంసా పత్రం అందాయి. శ్రీహరికోట మహిళా ఎస్సై భాను ప్రసన్నకు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ప్రశంసా పత్రం అందించి అభినందించారు. తడ హెడ్ కానిస్టేబుల్ బండ్ల సుధాకర్‌కు ప్రతిష్ఠాత్మక ‘ఉత్కృష్ట సేవా పతక్’ లభించగా, తడ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్కే సుహేల్ బాబుకు కూడా విశిష్ట సేవలకు పురస్కారం దక్కింది. తిరుపతిలో జరిగిన కార్యక్రమాల్లో ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, జిల్లా ఉన్నతాధికారుల చేతుల మీదుగా ఈ గౌరవాలు అందుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, ప్రజా భద్రతలో చూపిన అంకితభావానికి ఈ పురస్కారాలు గుర్తింపుగా నిలిచాయి. నాయుడుపేట డీఎస్పీ జి.చెంచుబాబు, సూళ్లూరుపేట సీఐ ఎం.మురళీకృష్ణతో పాటు పోలీస్ అధికారులు, సహచర సిబ్బంది అవార్డు గ్రహీతలను అభినందించారు. మూడు పోలీస్ స్టేషన్ల సిబ్బంది ఒకేసారి జిల్లా స్థాయిలో గుర్తింపు పొందడం పోలీస్ శాఖలో ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది. విధినిబద్ధతతో పనిచేస్తే సేవలకు తగిన గుర్తింపు లభిస్తుందనేందుకు ఈ పురస్కారాలు నిదర్శనంగా నిలిచాయి.