
పయనించే సూర్యుడు ఆగస్టు 19 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కుండలేశ్వరంలో పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులను పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ బి. గోపిచంద్ బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా పుష్కర ఘాట్ ప్రతిపాదిత నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి, స్థల పరిస్థితులు, సాంకేతిక అంశాలు, చేపట్టాల్సిన పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా పుష్కర ఘాట్ పరిసరాల్లో శానిటేషన్ పనులు, మురుగునీటి పారుదల, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ఆయన దృష్టి సారించారు.గ్రామంలోని మురుగునీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నేరుగా గోదావరిలో కలవకుండా తగిన డ్రైనేజీ, మురుగునీటి పారుదల ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. పుష్కర ఘాట్ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను కాపాడేందుకు ప్రత్యేక శానిటేషన్ చర్యలు చేపట్టాలని, మురుగునీరు నిల్వ ఉండకుండా అవసరమైన పనులను వెంటనే చేపట్టాలని ఆదేశించారు.పుష్కరాల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శానిటేషన్, డ్రైనేజీ, పారిశుధ్య మరియు ఇతర అవసరమైన పనులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని గోపిచంద్ సూచించారు. పుష్కర ఘాట్ మరియు పరిసర ప్రాంతాలను సురక్షితంగా, పరిశుభ్రంగా, ప్రజలకు అనుకూలంగా తీర్చిద్దాలని స్పష్టం చేశారు.నిర్మాణ మరియు అభివృద్ధి పనుల్లో ప్రతి దశలోనూ నిర్దేశిత సాంకేతిక, నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో ఈఈ జ్యోతి బాబు, ఏపీడీ మహేశ్వరరావు, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ బాలాజీ, ఏపీవో వేంకటేశ్వరరావు, ఈసీ వీరబాబు, ఇతర సిబ్బంది, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు