
జనం న్యూస్ | కూకట్పల్లి | జూలై 17 | తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్: చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లాకు చెందిన అఖిలేష్ యాదవ్ (24) కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తూ హాస్టల్లో నివాసం ఉంటున్నాడు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత తన స్నేహితుడు మహ్మద్ యునుస్ (26)తో కలిసి బైక్‌పై జేఎన్టీయూ నుంచి కూకట్పల్లి వైపు బయలుదేరారు.ఈ క్రమంలో కూకట్పల్లి భాగ్యనగర్ బస్‌స్టాప్ సమీపంలో మెట్రో పిల్లర్ నంబర్–746 వద్ద బైక్ ఒక్కసారిగా అదుపుతప్పి పిల్లర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడగా, అఖిలేష్ యాదవ్ ఘటనాస్థలంలోనే మృతి చెందాడు.తీవ్రంగా గాయపడిన మహ్మద్ యునుస్ను స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో సమీప ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను కూడా మృతి చెందినట్లు నిర్ధారించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇద్దరు యువకుల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.