
పయనించే సూర్యుడు జనవరి 8 ముమ్మడివరం ప్రతినిధి
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ కార్యకలాపాల కారణంగా ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తరచూ చోటుచేసుకుంటున్న గ్యాస్ లీకేజీలు, బ్లో అవుట్ల వల్ల ప్రాణనష్టం, ఆస్తినష్టం, పంటనష్టం సంభవిస్తున్నా సంబంధిత అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఘటనల అనంతరం ఓఎన్జీసీ అధికారులు తూతూ మంత్రంగా కొద్దిపాటి సాయం అందించి బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో రైతులు, గ్రామస్తులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
అలాగే, బ్లో అవుట్ల ప్రభావంతో స్థానిక ప్రజలు నిత్యం భయభ్రాంతుల మధ్య జీవనం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. పర్యావరణానికి కలుగుతున్న నష్టం పట్ల కూడా ప్రజల్లో తీవ్ర ఆందోళన ఉంది.ఈ పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే దృష్టి సారించి, బాధితులకు సముచిత నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా, కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, ప్రాంతాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరుతున్నారు.