
పయ నించే సూర్యుడు ఆగస్టు 31 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)ఆంధ్రప్రదేశ్లో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ కోరారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “జనతా వారధి” కార్యక్రమంలో క్రీడల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలతో సోమవారం జిల్లా కలెక్టరేట్ లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి ఎంతో అవసరమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానాలు, మౌలిక వసతులు, శిక్షణ అవకాశాలు మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో ఏపీ స్పోర్ట్స్ పాలసీ 2024–29ను సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతి జిల్లాలో మల్టీ స్పోర్ట్స్ స్టేడియం, ప్రతి మండలంలో క్రీడా కేంద్రం, ప్రతి గ్రామంలో ప్లేఫీల్డ్ ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ సమయం, విద్యార్థులకు ప్లేగ్రౌండ్ సదుపాయాలపై తనిఖీలు నిర్వహించాలని సూచించారు.అలాగే ఖేలో ఇండియా తదితర కేంద్ర ప్రభుత్వ క్రీడా నిధులను సకాలంలో వినియోగించి పారదర్శకత పాటించాలని, గ్రామీణ, గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో టాలెంట్ ఐడెంటిఫికేషన్ క్యాంపులు నిర్వహించి ప్రతిభావంతులను ప్రోత్సహించాలని కోరారు. బాలికలకు ప్రత్యేక క్రీడా వసతులు, భద్రతా చర్యలు కల్పించడంతో పాటు క్రీడాకారులకు కోచింగ్, పోషకాహారం, విద్య, ఫిజియోథెరపీ వంటి సహాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. “ఆడుదాం ఆంధ్ర” కార్యక్రమంలో క్రీడా సామగ్రి కొనుగోళ్లు, నిధుల వినియోగం, బహుమతి నగదు, నిర్వహణ తదితర అంశాలపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని నల్లా పవన్ డిమాండ్ చేశారు. క్రీడా నిధుల వినియోగంపై ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ ఆడిట్ నిర్వహించి ఖర్చుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనతా వారధి జిల్లా కన్వీనర్ చీకరమెల్లి శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి అరిగెల నాని, పట్టణ బీజేపీ అధ్యక్షులు అయ్యల భాషా, అంబాజీపేట మండల అధ్యక్షులు కురసా ఆంజనేయులు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పొనుగుపాటి శ్రీనివాస్, జిల్లా కార్యాలయ కార్యదర్శి డీవీఎస్ రాజు, గొకర కొండ గంగన్న స్వామి, అరిగెల తేజ తదితరులు పాల్గొన్నారు.