
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి పరిధిలోని ఐడీఎల్ సరస్సులో జరగనున్న గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, సాఫీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. నిమజ్జనం సందర్భంగా భక్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.ఈ మేరకు గురువారం ఐడీఎల్ సరస్సు వద్ద జరగబోయే గణేష్ నిమజ్జన ఏర్పాట్లను ట్రాఫిక్ సంయుక్త పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు పరిశీలించారు. నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీజన, పోలీసు ఉన్నతాధికారులు, కూకట్పల్లి ప్రాంతీయ కమిషనర్ వీరన్న, అదనపు పోలీసు కమిషనర్ నరేందర్, అదనపు పోలీసు కమిషనర్ నరేష్‌రెడ్డి, బాలానగర్ సహాయ పోలీసు కమిషనర్ ఆంజనేయులు, కూకట్పల్లి ఉప కమిషనర్, ట్రాఫిక్ విభాగం అధికారులు, మున్సిపల్ అధికారులు, హైడ్రా అధికారులు తదితరులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు.నిమజ్జనం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు, గణేష్ విగ్రహాలు తరలివచ్చే అవకాశం ఉన్నందున వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు. నిమజ్జన మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల మళ్లింపు, పార్కింగ్ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చోట ముందస్తు చర్యలు చేపట్టాలని, నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉన్నతాధికారులు సూచించారు. అలాగే ఐడీఎల్ సరస్సు వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ను కోరారు.గణేష్ నిమ్మజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు, మున్సిపల్, హైడ్రా విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు పోలీసుల సూచనలను పాటిస్తూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.