
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 21 ( సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలంలోని కోటపొలూరు రోడ్డులోని గాయత్రీనగర్‌లో శనివారం రాత్రి దొంగలు వరుస చోరీలకు పాల్పడ్డారు. ఒకే రాత్రి మూడు ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు తెగబడ్డారు. ఓ ఇంట్లోని మోటార్‌సైకిల్‌ను అపహరించగా, మరో ఇంట్లో రూ.40 వేల నగదు, రెండు సెట్ల బంగారు నగలు, ఉంగరాలు, వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. మరో ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఆదివారం ఉదయం యజమానులు ఇళ్లకు చేరుకుని చూడగా వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటంతో చోరీలు వెలుగులోకి వచ్చాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చోరీలకు సంబంధించిన ఆధారాలను సేకరించి కేసు నమోదు చేశారు. దొంగల ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వరుస చోరీలతో గాయత్రీనగర్ వాసుల్లో ఆందోళన నెలకొంది. రాత్రివేళల్లో గస్తీ పెంచాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.