పయనించే సూర్యుడు టేకులపల్లి ప్రతినిధి పొనకంటి ఉపేందర్ రావు: టేకులపల్లి గిరిజన సంస్కృతి,
సాంప్రదాయాలకు ఎంతో విలువలున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి అన్నారు. సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో శనివారం టేకులపల్లి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కల్చరల్ మీట్ వర్క్ షాప్ నిర్వహించారు. డిఈఓ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో ఎంపిక చేసిన ఐదు పాఠశాలలో ఈ కల్చరల్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో మన జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల టేకులపల్లి ఎంపిక అయిందని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు చదువులోనే కాకుండా ఆటల్లో పాటల్లో ముందు ఉన్నారని మెచ్చుకున్నారు. గిరిజన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కళలు అంతరించి పోకుండా ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. పూర్వీకులు మనకు అందించిన సాంప్రదాయాలను ముందు తరాలకు అందిద్దామని అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. అలాగే గిరిజన వేషధారణ కట్టుబాట్లు కళ్లకు కట్టినట్లుగా పెయింటింగ్స్ వేశారు. ఈ సందర్భంగా దీనికి విశేష కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు మెరుగు శ్రీనివాస్ నీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి నాగ శేఖర్, ఎంఈఓ జగన్, సతీష్ కుమార్, సైదులు, అన్నామని, శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.