
జనం న్యూస్ డిసెంబర్ 5 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
తెలుగు నేల ఉన్నంత కాలం ప్రతి ఇంట ప్రతి వేదిక ప్రతి గుడిలో ఘంటసాల పాటలు మారుమ్రాగుతూనే వుంటాయని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్ అరికెపూడి గాంధీ అన్నారు. ఘంటసాల స్వరం దేవుడిచ్చిన వరం, ఘంటసాల పాటలు అజరామరం అని ఆయన కొనియాడారు. శుక్రవారం సీనియర్ పాత్రికేయులు బి. వెంకటేశ్వర్లు తల్లి బి. కృష్ణమ్మ స్మృత్యర్థం, ఘంటసాల వెంకటేశ్వరరావు 103వ జయంతి వేడుకలను కూకట్ పల్లి ప్రెకాస స్టూడియోలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ జ్యోతి ప్రకాశనం చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కళ పత్రిక ప్రత్యేక సంచిక ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. ఘంటసాల పాటలు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తాయని, అలసిన మనసును సేద తీరుస్తాయని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. నిజాయితీ నిబద్ధత కలిగిన పాత్రికేయ శిరోమణి వెంకటేశ్వర్లు అని, ఆయన గాయకుడుగా కూడా గుర్తింపు పొందడం అభినందనీయం అన్నారు. సినీ నేపథ్య గాయకుడు, సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రవివర్మ మాట్లాడుతూ ఘంటసాల పాటలు ఎన్ని సార్లు విన్నా తనివి తీరదని, ఘంటసాల పాడిన పాటలు పాడుతూ ఎందరో గాయకులు ఉపాధి పొందుతున్నారని గుర్తు చేశారు. కళ పత్రిక సంపాదకులు డాక్టర్ మహ్మద్ రఫీ మాట్లాడుతూ ఘంటసాల అమర గాయకుడు అని, ఇన్నేళ్లు అయినా ఘంటసాల స్వరాన్ని మించిన స్వరం మరొకటి రాలేదన్నారు. తెలంగాణలో మూడు దశాబ్దాల పాత్రికేయుడిగా తనదైన గుర్తింపు పొంది మంచికి మారుపేరుగా నిలిచిన జర్నలిస్ట్ వెంకటేశ్వర్లు సేవలను గుర్తించి కళ పత్రిక ప్రత్యేక సంచిక విడుదల చేసినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి మీడియా సెల్ రాష్ట్ర అధ్యక్షులు బి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తనకు జర్నలిజం, గానం రెండూ ప్రాణం అన్నారు. ఘంటసాల, బాలూ పాటలు ఇష్టమని, అందుకే ప్రత్యేక సమయం కేటాయించి సంగీత విభావరి నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎసిపి కడారు వెంకటరెడ్డి, ఎసిపి వేముల భాస్కర్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, సాంఘిక సంక్షేమ శాఖ స్టాఫ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పు సత్యనారాయణ, బిసి సంక్షేమ సంఘం నేత తేళ్ల హరికృష్ణ, తదితరులు పాల్గొని ఘంటసాలకు, బి.కృష్ణమ్మ కు నివాళులు అర్పించారు. జర్నలిస్ట్ వెంకటేశ్వర్లును అభినందించారు. ప్రెకాస నిర్వాహకులు సబిత మట్ల, ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో గాయకులు రవివర్మ, బి. వెంకటేశ్వర్లు, లాలయ్య, పి.శ్రీనివాసరావు, రాధికాశర్మ తదితర 20 మంది గాయకులతో ఎనిమిది గంటల పాటు జరిగిన ఘంటసాల పాటల విభావరి అలరించింది.
