పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 18:- రిపోర్టర్ (కే. శివకృష్ణ) చేనేత కుటుంబాల జీవన స్థితిగతులను మెరుగుపరుచుటకు తీసుకోవలసిన చర్యల పై సంబంధిత అధికారులతో సోమవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,ముద్ర పథకం కింద చేనేత కుటుంబాలకు చేయూత అందించేందుకు 1,044 మందికి రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. ఇప్పటివరకు 76 మందికి మాత్రమే ఆయా బ్యాంకుల ద్వారా రుణాలు అందాయని తెలిపారు. 245 మందికి రుణాలు మంజూరైనాయని అన్నారు. జిల్లాలో మండలాల వారీగా చేనేత కుటుంబాల సర్వే జరిగిందన్నారు. జిల్లాలో 7794 చేనేత కుటుంబాలు ఉండగా అందులో 7217 కుటుంబాలు యాక్టివ్ గాను 581 కుటుంబాలు ఇనాక్టివ్ గా ఉన్నాయని సర్వే నివేదిక ద్వారా తెలుస్తుందన్నారు. ఈ కుటుంబాలు 18 బ్యాంకుల పరిధిలోకి వస్తాయని ఎల్.డి.ఎం జిల్లా కలెక్టర్ కు వివరించారు. 18 బ్యాంకులకు సంబంధించిన మేనేజర్లకు, గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కు, చేనేత జౌళి సహాయ సంచాలకులకు సర్వే రిపోర్ట్ ను అందజే యాలని డి ఎల్ డి వో అధికారులను ఆయన ఆదేశించారు. సర్వే నివేదిక ప్రకారం ఈ రోజు నుండి బ్యాంకు అధికారులు రుణాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. రుణాలు మంజూరు లో ఆయా చేనేత కుటుంబాలను తనిఖీ చేసినప్పుడు అక్కడ మగ్గాలు లేవని ఎల్ డి ఎం కలెక్టర్ కు వివరించారు. మగ్గాలు లేని కుటుంబాలు చేనేతకు సంబంధించి ఇతర వృత్తిలో ఉన్నారో తెలుసుకొని వారికి రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ తెలిపారు. రుణాలు మంజూరు చేయుటకు మార్జిన్ మనీ రూ. 25 వేలు ముందుగా కట్టాలని, కడితే గాని రుణాలు మంజూరు చేయడం లేదని, సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నందున రుణాలు ఇవ్వడం లేదని చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు కలెక్టర్ కు వివరించారు. జిల్లాలో చీరాల, వేటపాలెం, భట్టిప్రోలు, చెరుకూరు, రేపల్లె, మార్టూరు మండలాల లో నేత కార్మికుల కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని సర్వే రిపోర్ట్ తెలుపుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ6 మండలాలలోని చేనేత కుటుంబాలను చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు, ఎల్ డి ఎం కలసి వ్యక్తిగతంగా వెళ్లి వారితో చర్చించి రుణాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సిబిల్ స్కోర్ తక్కువగా ఉండి రుణాలు మంజూరు కానటువంటి కుటుంబాలను గుర్తించి వారికి శ్రీనిధి కింద రూ. 50 వేల నుండి రూ.60 వేల వరకు రుణాలు మంజూరు చేయుటకు చర్యలు తీసుకోవాలని గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కు కలెక్టర్ సూచించారు. నూరు శాతం చేనేత కుటుంబాలకు రుణాలు మంజూరు చేయుటకు క్షేత్రస్థాయిలో ప్రక్రియ సమర్ధంగా నిర్వహించడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించు కోవాలన్నారు. చేనేతలకు మేలు చేయడమే లక్ష్యంగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన సూచనలు చేశారు. ఈ సమావేశంలో చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు నాగమల్లేశ్వరరావు, ఎల్ డి ఎం శివకృష్ణ, డి.ఆర్.డి.ఏ పి.డి పద్మ, బాపట్ల డి.ఎల్.డి.ఓ సి.హెచ్ విజయలక్ష్మి, చీరాల డి ఎల్ డి ఓ పద్మావతి పాల్గొన్నారు. (జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల అధికారి, బాపట్ల వారిచే జారీచేయడమైనది.)