
పయనించే సూర్యుడు న్యూస్ :.. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో హైదరాబాద్-బీజాపూర్ హైవేపై ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. సోమవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. వాహనాలు వేగంగా ఒకదానికొకటి ఢీ కొనడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ప్రమాదంలో 15 నెలల చిన్నారితో సహా తల్లి మృతి కూడా మృతి చెందింది. తల్లి పొత్తిళ్లలో వెచ్చగా పడుకున్న చిన్నారి ప్రమాదంలో తల్లి చేతుల్లోనే ప్రాణాలు వదిలింది. తల్లీబిడ్డ రోడ్డుపై మృతి చెందిన దృశ్యాలు గుండెను పిండేస్తున్నాయి. ఈ రోడ్డు ప్రమాద దృశ్యాలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. ముఖ్యంగా రోడ్డుపై విగత జీవులుగా పక్కపక్కనే పడిఉన్న తల్లీబిడ్డల ఫొటో ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది.కంకరతో వెళ్తున్న టిప్పర్ లారీ అదుపుతప్పి బస్సును ఢీ కొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర టర్నింగ్ పాయింట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం 20 మంది మృతి చెందారు. మొత్తం మృతుల్లో 10 మంది పురుషులు, 9 మంది మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. టిప్పర్ ఓవర్ స్పీడ్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. మృతుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను హుటాహుటీన ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. రెస్క్యూ బృందాలు బస్సులో కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.