
పయనించే సూర్యుడు ఆగస్టు 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి విమర్శ మార్కాపురం: భారత జాతీయ గీతమైన *‘వందేమాతరం’*ను పూర్తిగా ఆలపించకుండా కేవలం రెండు చరణాలకే పరిమితం చేస్తామని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం అత్యంత దారుణమని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి విమర్శించారు. జాతీయ భావోద్వేగాలతో ముడిపడిన వందేమాతరాన్ని కూడా రాజకీయ నిర్ణయాలకు, పార్టీ విధానాలకు అనుగుణంగా కుదించడం సముచితం కాదని ఆయన అన్నారు. అలాగే ఆగస్టు 15 న కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేలు వందేమాతరంను ఆలపించకుండా యధాలాపంగా ఉండటం జాతీయ గీతాన్ని అవమానించడమే అవుతుందని ఆయన మండిపడ్డారు.. వందేమాతరం ఒక సాధారణ గీతం కాదని, భారత స్వాతంత్ర్యోద్యమానికి స్ఫూర్తినిచ్చిన మహోన్నత జాతీయ గీతమని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. బంకిమ్చంద్ర ఛటర్జీ రచించిన ఈ గీతం భారతీయుల్లో మాతృభూమిపై భక్తి, దేశభక్తి, ఆత్మగౌరవం, ఐక్యతా భావాలను రగిలించిందన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులకు వందేమాతరం ఒక నినాదంగా, ఒక స్ఫూర్తిగా, ఒక పోరాట శక్తిగా నిలిచిందని చెప్పారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరుల స్ఫూర్తికి ప్రతీక వందేమాతరం. తల్లిభూమిని స్తుతించే ఈ మహోన్నత గీతాన్ని కుదించడమా.. లేక దాని సంపూర్ణ గొప్పతనాన్ని భావితరాలకు అందించడమా అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలన్నారు.. జాతీయ భావనను రాజకీయ ప్రయోజనాల కోసం పరిమితం చేయడం తగదు” అని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వందేమాతరం 150 సంవత్సరాల వేడుకలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ, స్వాతంత్ర్యోద్యమ చరిత్రను, జాతీయ స్ఫూర్తిని భావితరాలకు చేరవేసే కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు.