
పయనించే సూర్యుడు జూలై 25 ( సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )తిరుపతి జిల్లా, సుళ్ళూరుపేటలోని డా.బి.ఆర్. అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాల కళాశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సంయుక్త సమావేశం ఘనంగా జరిగింది. కళాశాల సిబ్బంది, పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు మరియు సుమారు 1060 మంది విద్యార్థినులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో యువత ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థినులు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా చదువుపై పూర్తి దృష్టి పెట్టాలని, చెడు వ్యసనాలకు బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. డిజిటల్ యుగంలో సోషల్ మీడియా మోసాలు, సైబర్ క్రైమ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ బాలికలను, తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. బాలికలు ధైర్యంగా విద్యనభ్యసించాలని, ఆకతాయిలు ఈవ్ టీజింగ్‌కు పాల్పడినా లేదా సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురిచేసినా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థినులకు ఏ సమస్య వచ్చినా పోలీసులను ఆశ్రయించవచ్చని, వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా కల్పించారు.అలాగే తల్లిదండ్రులకు ప్రత్యేక సందేశమిస్తూ.. మైనర్ బాలికలకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల బాలికల భవిష్యత్తు నాశనమవుతుందని స్పష్టం చేశారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో సీఐ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ సందేశాన్నిచ్చారు.