
పయనించే సూర్యుడు న్యూస్ జూలై 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ; వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ ప్రపంచంలో సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే వ్యక్తిగత భద్రతకు కీలకమని నిపుణులు స్పష్టం చేశారు. యువతలో డిజిటల్ బాధ్యత, సైబర్ అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ), సైబరాబాద్ పోలీసులు, తెలంగాణ రైజింగ్ సంయుక్తంగా నిర్వహించిన "కాఫీ విత్ ఎ కాప్" ఆరో ఎపిసోడ్ గురువారం గోపన్‌పల్లిలోని విప్రో క్యాంపస్‌లో విజయవంతంగా జరిగింది. "కనెక్టెడ్… నాట్ కన్స్యూమ్డ్: నావిగేటింగ్ ది డిజిటల్ ఏజ్" అనే అంశంపై నిర్వహించిన ఈ కార్యక్రమానికి యువ ఉద్యోగులు, ఐటీ నిపుణులు విశేషంగా హాజరై సైబర్ భద్రతకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన పొందారు.విప్రో సెంటర్ హెడ్ వెంకట్ శేషు కార్యక్రమానికి ఆతిథ్యం వహిస్తూ, ఉద్యోగుల్లో సైబర్ భద్రతపై చైతన్యం పెంపొందించేందుకు ఎస్సీఎస్సీ, సైబరాబాద్ పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు.తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ క్రైమ్ అండ్ ఆపరేషన్స్ ఎస్పీ సాయి శ్రీ ప్రధాన వక్తగా పాల్గొని, ప్రస్తుతం విస్తరిస్తున్న ఆన్లైన్ ఆర్థిక మోసాలు, ఫిషింగ్ దాడులు, క్యూఆర్ కోడ్ స్కామ్‌లు, నకిలీ పెట్టుబడి పథకాలు, సోషల్ ఇంజినీరింగ్, సోషల్ మీడియా భద్రత, ఏఐ ఆధారిత డీప్‌ఫేక్‌లు, పాస్వర్డ్ రక్షణ, ఓటీపీ మోసాలు, డిజిటల్ గోప్యత వంటి కీలక అంశాలను ఉదాహరణలతో వివరించారు.ఈ సందర్భంగా పాల్గొన్న యువత సైబర్ మోసాల నుంచి రక్షణ, సోషల్ మీడియా సురక్షిత వినియోగం, వ్యక్తిగత సమాచార పరిరక్షణ, సైబర్ నేరాలకు గురైనప్పుడు వెంటనే తీసుకోవాల్సిన చర్యలపై ప్రశ్నలు అడిగి నిపుణుల నుంచి సమగ్ర సమాధానాలు పొందారు.
"ప్రతి క్లిక్… ప్రతి నిర్ణయం… ప్రతి చర్యకు బాధ్యత ఉంటుంది. అప్రమత్తత, ధృవీకరణ, సైబర్ పరిశుభ్రత పాటించడం ద్వారానే సైబర్ నేరాలను సమర్థంగా అడ్డుకోవచ్చు" అని ఎస్పీ సాయి శ్రీ పేర్కొన్నారు. పోలీసు అధికారిగా, ఇద్దరు పిల్లలకు తల్లిగా తన అనుభవాలను పంచుకుంటూ, బాధ్యతాయుతమైన డిజిటల్ పౌరులను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.ఎస్సీఎస్సీ సీఈఓ నవేద్ ఆలమ్ ఖాన్ సంస్థ చేపడుతున్న కమ్యూనిటీ భద్రత కార్యక్రమాలు, పరిశ్రమలు-ప్రజల భాగస్వామ్యంపై వివరించగా, డైరెక్టర్ (స్ట్రాటజిక్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్) రష్మి శ్రీవాస్తవ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తూ పాల్గొన్న వారితో చురుకైన సంభాషణ నిర్వహించారు.
ఇప్పటికే ఆరు విజయవంతమైన ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న "కాఫీ విత్ ఎ కాప్" కార్యక్రమం, యువతను సీనియర్ పోలీసు అధికారులతో అనుసంధానిస్తూ నాయకత్వం, ప్రజాసేవ, సామాజిక బాధ్యత, సైబర్ భద్రత వంటి అంశాలపై చైతన్యం కల్పించే విశిష్ట వేదికగా నిలుస్తోంది.కార్యక్రమం ముగింపులో "సాంకేతికత ఎంత శక్తి వంతమైనదైనా, అవగాహన, బాధ్యత, సరైన నిర్ణయాలే సురక్షితమైన డిజిటల్ భవిష్యత్తుకు పునాది అనే సందేహాన్ని నిర్వాహకులు యువత అందించారు