
వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో రేపు ఏరియల్ సర్వే నిర్వహించనున్న సీఎం
జిల్లా కలెక్టర్లు, అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు
పయనించే సూర్యుడు అక్టోబర్ 30 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం:రాష్ట్రవ్యాప్తంగా తుఫాను ప్రభావం ఉన్న జిల్లాల్లో ప్రభుత్వం పూర్తిస్థాయి అప్రమత్తతతో వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రాష్ట్రంలోని 16 జిల్లాల్లో తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున, అన్ని విభాగాలు సమన్వయంతో అత్యవసర చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి పరిస్థితులను సమీక్షించారు. భద్రతా, సహాయక చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇవాళ్టి వరంగల్ పర్యటనను వాయిదా వేసుకున్నాను. రేపు వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి, పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలిస్తాను,” అని ముఖ్యమంత్రి తెలిపారు.తుఫాను ప్రభావిత జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు అండగా నిలవాలని, ప్రతి స్థాయిలో అధికారులు ప్రజలతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆయన ఆదేశించారు. “ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎవరి ప్రాణ నష్టం జరగకూడదు, పశు నష్టం, పంట నష్టం జరగకుండా అధికారులు ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలి,” అని సీఎం అన్నారు.విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ ముందస్తు చర్యలు తీసుకోవాలని, రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రమాదకర ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేయాలని, వాగులు, వంకల వద్ద ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.అవసరమైన చోటహైడ్రాసేవలనువినియోగించుకోవాలని, అత్యవసర వైద్య సేవలను తక్షణం అందుబాటులో ఉంచాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలించడమే కాక, డ్రోన్ల ద్వారా తాగునీరు, ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు.వరంగల్లో వరద బాధితులకు సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న ఎస్డీఆర్ఎఫ్ బృందాలను తక్షణం అక్కడికి తరలించాలని, హైడ్రా సిబ్బంది మరియు సహాయక సామాగ్రిని వినియోగించి ప్రజలకు తక్షణ సాయం అందించాలన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరం నుండి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిని రుక్మిణి మరియు సంబంధిత శాఖల అధికారుల తో కలిసి పాల్గొన్నారు.