
పయనించే సూర్యుడు న్యూస్ :కేరళలోని ఇడుక్కిలోని అనాచల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ స్కై-డైనింగ్ వద్ద ఓ క్రేన్లో సాంకేతిక వైఫల్యం తలెత్తింది. దీంతో అనేక మంది పర్యాటకులు భూమికి దాదాపు 120 అడుగుల ఎత్తులో ఆకాశంలో ఇరుక్కుపోయారు. గంటన్నరకు పైగా ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ అక్కడే గడిపారు. మున్నార్ సమీపంలో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని గాల్లో వేలాడుతున్న పర్యాటకులను సురక్షితంగా కిందకు దించే ప్రయత్నం చేస్తున్నారు.చాలా మందికి అడ్వెంచర్ టూరిజం అంటే మహా ఇష్టం. వీరంతా ప్రపంచంలోని ఎత్తైన ప్రదేశాలకు వెదికి మరీ వెళ్తుంటారు. ఇలాంటి ప్రదేశమే కేరళలోని ఇడుక్కిలోని అనాచల్లో మున్నార్ సమీపంలో ఒకటి ఉంది. ఇక్కడి క్రేన్-ఆపరేటెడ్ డైనింగ్ ప్లాట్ఫామ్ పర్యాటకులకు ఎంతో ఇష్టం. ఆకాశంలో తెలియాడుతున్న అనుభూతి వారికి కలిగించే భారీ క్రేన్ లిఫ్ట్లు ఇక్కడ ఉన్నాయి మరీ. కొన్ని నెలల క్రితమే ఇక్కడ స్కై-డైనింగ్ ప్రారంభమైంది. ఇందులో ఒకేసారి 16 మంది వరకు కూర్చోవడానికి వీలుంటుంది. వారిని లోయపైకి అరగంట పాటు పైకి తీసుకెళ్లి ప్రకృతి దృశ్యాలు ఆస్వాదించడానికి అనువుగా ఉంటుంది.