
పయనించే సూర్యుడు న్యూస్ :దక్షిణ మెక్సికో దేశంలోని ఓక్సాకా రాష్ట్రంలో ఆదివారం (డిసెంబర్ 28) ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. నిజాండా సిటీలో ఇంటర్ ఓషియానిక్ రైలు పట్టాలు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది మరణించగా.. దాదాపు 100 మందికిపైగా గాయపడ్డారు. పట్టాలు తప్పిన ఈ రైలులో తొమ్మిది మంది సిబ్బంది సహా 241 మంది ప్రయాణికులతో కలిపి 250 మంది ఉన్నట్లు మెక్సికన్ స్థానిక మీడియా సంస్థ తెలిపింది. ఇంటర్ ఓషియనిక్ ట్రైన్ యాక్సిడెంట్ ఘటనలతో పసిఫిక్ మహాసముద్రాన్ని మెక్సికో గల్ఫ్‌తో కలిపే రైలు మార్గంలో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి.ఓక్సాకా – వెరాక్రూజ్ సరిహద్దులోని నిజాండా సిటీ సమీపంలో ఓ వంపు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో 193 మంది సురక్షితంగా బయపడ్డారు. 98 మంది గాయపడగా..వీరిని రెస్క్యూ సిబ్బంది రక్షించి సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో 36 మంది చికిత్స పొందుతున్నారు. రైలు ప్రమాదంపై మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ ఎక్స్ వేదికగా స్పందించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని, మరణించిన వారి కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు.రెస్క్యూ ఆపరేషన్‌లో నావికాదళం సహా మొత్తం 360 మంది సిబ్బంది, 20 వాహనాలు, నాలుగు గ్రౌండ్ అంబులెన్స్‌లు, మూడు ఎయిర్ అంబులెన్స్‌లు, ఒక డ్రోన్‌ను సంఘటన స్థలంలో మోహరించినట్లు తెలిపింది. ఈ సంఘటనపై దర్యాప్తు ఇప్పటికే ప్రారంభించినట్లు అటార్నీ జనరల్ ఎర్నెస్టినా గొడోయ్ రామోస్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.కాగా ఇంటర్ ఓషియానిక్ రైలును 2023లో అప్పటి అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ ప్రారంభించారు. దక్షిణ మెక్సికోలో రైలు ప్రయాణాన్ని పెంచడానికి, పసిఫిక్ మహాసముద్రం – మెక్సికో గల్ఫ్ మధ్య ఇరుకైన భూభాగమైన టెహువాంటెపెక్ ఇస్త్మస్ వెంబడి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ఈ రైలు మార్గం ఉపయోగపడుతుంది. మెక్సికన్ ప్రభుత్వం ఇస్త్మస్‌ను అంతర్జాతీయ వాణిజ్యానికి వ్యూహాత్మక కారిడార్‌గా మార్చాలని భావిస్తుంది. ఇందుకోసం అట్లాంటిక్ – పసిఫిక్ మహాసముద్రాలను అనుసంధానించగల ఓడరేవులు, రైలు మార్గాలను అభివృద్ధి చేయాలని భావించింది. ఈ మార్గంలో ఏర్పాట్లు చేసిన తొలి ట్రైన్ ఇంటర్ఓషియానిక్ రైలు ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలోని సలీనా క్రజ్ ఓడరేవు నుంచి కోట్జాకోల్కోస్ వరకు నడుస్తుంది. ఇది దాదాపు 290 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది.