
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి
ఫిబ్రవరి 12న దేశవ్యాప్త కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం (ఐప్వా) జిల్లా కన్వీనర్ మెంగ లక్ష్మి పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ కార్మికుల చట్టాలను, హక్కులను కాల రాస్తున్నాయని ఆమె విమర్శించారు. కనీస వేతనాలు లేకుండా చేయడం లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కార్పొరేట్ సంస్థల కోసం ప్రభుత్వం పని చేస్తుందని, అందులో భాగంగానే కార్మిక చట్టాలను సవరించి లేబర్ కోడ్స్ ను తీసుకు వచ్చారని ఆమె అన్నారు. ఉత్పత్తిలో పురుషులతోపాటు మహిళల పాత్ర కీలకమైందని, సమాజ అభివృద్ధిలో మహిళలు ముందున్నారని లక్ష్మి తెలిపారు. లేబర్ కోడ్స్ అమలు అయితే మహిళలకు భద్రత ఉండదని, కార్మిక సంక్షేమం భద్రత కనీస వేతనాలు అమలుకావని, కార్మికుల పాలిట శాపంగా మారిన లేబర్ కోడ్స్‌ను తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని మార్చిందని, విబి రామ్ జి పేరుతో తీసుకువచ్చిన బిల్లు అత్యంత ప్రమాదకరమైందని, కూలీల ఉపాధిని లాక్కునే దీనిని తిరస్కరించాలని, కార్మికుల హక్కుల కోసం, కనీస వేతనాల కోసం, భద్రత కోసం, సంక్షేమం కోసం మహిళా లోకం పెద్ద ఎత్తున దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు.