
పయనించే సూర్యుడు ఆగస్టు 26 ముమ్మిడివరం ప్రతినిధి ( గ్రంధి నానాజీ)భారతదేశ సాంస్కృతిక వైభవానికి, సనాతన సంప్రదాయాలకు సంచార జాతులే సజీవ వారధులని బీజేపీ నాయకత్వం కొనియాడింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పి.వి.ఎన్. మాధవ్ ఆదేశానుసారం, రాష్ట్ర ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నాలుగు జోన్లలో "సంచార - అర్ధ సంచార విముక్త జాతుల విముక్తి దినోత్సవం స్ఫూర్తి" సదస్సులను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం జోనల్ పరిధిలో జరిగే సదస్సు వాల్ పోస్టర్ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు మరియు ఇతర ముఖ్య నాయకుల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు పసుపులేటి మహాలక్ష్మి రావు, బీజేపీ జిల్లా సంచార జాతుల సెల్ కన్వీనర్ వీర్నాల రమణబాబు సంయుక్తంగా ప్రకటన విడుదల చేస్తూ సంచార జాతుల ఘనతను కొనియాడారు. తరతరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో జానపద కళారూపాలు, విన్యాసాలు, కథాగానాలు, సంగీతం మరియు సంప్రదాయ చేతివృత్తుల ద్వారా భారతీయ ప్రాచీన సంస్కృతిని సజీవంగా నిలబెట్టిన ఘనత సంచార జాతులదే. బ్రిటిష్ వలస పాలనలోని నిరంకుశ చట్టాలను ఎదిరించి, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ధీర దేశభక్తులు సంచార జాతుల పూర్వీకులు. స్వాతంత్ర్యానంతరం సరైన గుర్తింపునకు నోచుకోని సంచార, అర్ధ-సంచార తెగలకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సీడ్ వంటి పథకాల ద్వారా గుర్తింపు, సంక్షేమం అందిస్తోంది. ఈ హక్కులను క్షేత్రస్థాయికి చేర్చడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. కార్యక్రమం తేదీ 30-08-2026 ఆదివారం, సమయం మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు, వేదిక భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యాలయ ప్రాంగణం, క్వారీ మార్కెట్ సెంటర్, రాజమహేంద్రవరం. ఈ చారిత్రాత్మక సదస్సుకు ఉమ్మడి గోదావరి జిల్లాల పరిధిలోని సంచార, అర్ధ-సంచార, విముక్త కులాల పెద్దలు, కళాకారులు, యువత, సంఘాల ప్రతినిధులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.