
ఆలయ మర్యాదలతో ఆహ్వానించిన మంత్రి వాసంశెట్టి సుభాష్
పయ నించే సూర్యుడు ఆగస్టు 14 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్, ఆలయ ఈవో అల్లువెంకట దుర్గా భవాని ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు వేదమంత్రోచ్చారణల నడుమస్వాగతం పలికి ఘనంగా ఆహ్వానించారు.అనంతరం మంత్రి సుభాష్ ఆలయ మర్యాదలతో అన్నా కొణిదెలను ఆలయంలోకి తీసుకువెళ్లి, శ్రీ మాణిక్యాంబా అమ్మవారు మరియు శ్రీ భీమేశ్వర స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజలు, కుంకుమార్చన కార్యక్రమాల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.పూజా కార్యక్రమాల అనంతరం బేడా మండపంలో వేద పండితులు, అర్చకులుఅన్నా కొణిదెలకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు సంపత్ దంపతుల కుమారుడికి యక్షిత్ ఓంకార్ గా అన్నా కొణిదెల నామకరణం చేసి, పసిబాలుడితో ఆప్యాయంగా ముద్దు చేశారు.దేవస్థానానికి విచ్చేసిన అన్నా కొణిదెలకు ఆలయ సంప్రదాయాల ప్రకారం మంత్రి వాసంశెట్టి సుభాష్, దేవస్థానం ఈవో అల్లువెంకట దుర్గాభవాని కలిసి పట్టు వస్త్రాలు, శ్రీ స్వామివారి చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో దుర్గాభవాని, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, వేద పండితులు, జనసేన నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.