
పయనించే సూర్యుడు న్యూస్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిలో ధనుర్మాస వేడుకలు ప్రారంభమయ్యాయి. శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో నేటి నుంచి జనవరి 14 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. గోదాదేవి అమ్మవారు శ్రీరంగనాథుని కొలుస్తూ.. నెల రోజుల పాటు నిర్వహించే పాశుర పఠనాలను ఆలయ అర్చకులు పారాయణికులు ప్రత్యేకంగా జరిపిస్తారు. ఇందులో భాగంగా ఆలయ కైంకర్యాల్లో మార్పులు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.యాదగిరి పుణ్యక్షేత్రంలో ప్రతిరోజు తెల్లవారుజామున 4.30 గంటల నుంచి 5 గంటల వరకు ధనుర్మాస వేడుకలను జరిపిస్తారు. ఇక, శ్రీస్వామి వారి ఆలయ ముఖ మండపంపై ఉత్తర భాగంలోని హాల్లో గోదాదేవి అమ్మవారిని ఒక ప్రత్యేక స్థానంలో ఉంచి, తిరుప్పావై, మార్గళి నివేదన వేడుకలను నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా.. జనవరి 14 న రాత్రి 7 గంటలకు ఆలయ ముఖ మండపంలో గోదాదేవి శ్రీరంగనాథుల వివాహ మహోత్సవం, అలాగే 15వ తారీఖు ఉదయం 11.30 గంటలకు శ్రీస్వామి, అమ్మవార్లకు ఒడి బియ్యం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక, ధనుర్మాస వేడుకలను సందర్భంగా.. ఆలయ కైంకర్యాల సమయంలో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు నుంచి జనవరి 14 వరకు తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయాన్ని తెరిచి సుప్రభాతం నిర్వహిస్తారు. ఆ తర్వాత 4 గంటల నుంచి 4.30 గంటల వరకు తిరువారాధన, 4.30 గంటల నుంచి 5 గంటల వరకు తిరుప్పావై సేవాకాలం జరిపించనున్నారు. ఇక, 5 గంటల నుంచి 6 గంటల వరకు నివేదన, చాత్మర. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు నిజాభిషేకం. 7 గంటల నుంచి 7.45 గంటల వరకు సహస్రనామ అర్చన వంటివి ఉంటాయని అధికారులు వెల్లడించారు. అనంతరం దర్శనాలు ప్రారంభమవుతాయని, నిత్య కైంకర్యాలు ప్రతిరోజు యథాతదంగా ఉంటాయని వివరించారు.