పయనించే సూర్యుడు అక్టోబర్ 17,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
పట్టణ పేదరిక నిర్మూలనపై 'ప్రత్యేక దృష్టి'
నంద్యాల జిల్లా,
పట్టణ ప్రాంతాలలో పేదరిక నిర్మూలన మరియు మహిళా సాధికారత లక్ష్యంగా పనిచేస్తున్న మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ (మెప్మా) ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ)గా వెంకట దాస్ గురువారం నంద్యాల పట్టణంలో బాధ్యతలు స్వీకరించారు.పట్టణంలోని మెప్మా కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఆయన లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా నూతన పీడీ వెంకట దాస్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పట్టణ ప్రాంత పేదలకు, ముఖ్యంగా స్వయం సహాయక బృందాల (SHG) మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, లబ్ధి చేకూరే కార్యక్రమాలు సకాలంలో క్షేత్రస్థాయి వరకు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు."మెప్మా ద్వారా అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు- స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఆర్థిక తోడ్పాటు (బ్యాంకు లింకేజీ), వీధి వ్యాపారులకు సహాయం వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేయడమే తన ప్రథమ లక్ష్యం" అని ఆయన స్పష్టం చేశారు. పేదరికం లేని, స్వయం సమృద్ధి సాధించిన పట్టణ సమాజాన్ని నిర్మించడంలో నంద్యాల మెప్మా యూనిట్‌ను ఆదర్శంగా నిలపడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.వెంకట దాస్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మెప్మా సిబ్బంది, పలు స్వయం సహాయక సంఘాల సభ్యులు, పట్టణ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మెప్మాలో ఆయన అందించిన సేవలను, సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలను పలువురు ప్రశంసించారు. ఆయన సారథ్యంలో నంద్యాల పట్టణంలోని పేద ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.