
రుద్రూర్ అక్టోబర్ 30(పయనించే సూర్యుడు రుద్రూర్ మండల ప్రతినిధి):
తూముల విడుదల చేయడంతో నష్టపోయిన పంటకు నష్టపరిహారం చెల్లించాలని రుద్రూర్ గ్రామ రైతు పెంట పోశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని రుద్రూర్ గ్రామ శివారులోని చెరువు కట్ట కింద 2 ఎకరాల 6 గుంటల పొలం ఉందని, తూములు విడుదల చేయడంతో, పంట పొలాల్లోకి నీరు వచ్చి పంట మొత్తం నీటిలో మునిగిపోయిందని, ప్రతిసారి ఇలాగే జరుగుతుంది అని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు పూర్తి స్థాయిలో నిండినప్పుడు మాత్రమే తూములు విడుదల చేయాల్సి ఉండగా, చెరువు నిండకన్నా ముందే తూములు విడుదల చేయడంతో చేతికొచ్చిన వరి పంట మొత్తం నీటి పాలైందని రైతు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నష్టపోయిన పంటకు నష్టపరిహారం చెల్లించి తమకు న్యాయం చేయాలని కోరారు.
