
{పయనించే సూర్యుడు} {ఏప్రిల్ 12}
ఏప్రిల్ 11/04/2026 రోజు నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను అధికారికంగా అత్యంత ఘనంగా నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ (జెయింట్ కలెక్టర్) శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, వివిధ సామాజిక సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాత్మ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతిరావు పూలే బీసీ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు వాకిటి ఆంజనేయులు ముదిరాజ్ మాట్లాడుతూ.. సమాజంలో అంటరానితనం వేళ్లూనుకుపోయిన రోజుల్లోనే విద్యతోనే మార్పు సాధ్యమని నమ్మిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఆనాడు చదువు అందని స్థితిలో ఉన్న తన భార్య సావిత్రిబాయి పూలేకు విద్య నేర్పించి, మహిళా సాధికారతకు బాటలు వేశారని, స్త్రీలు పురుషులతో సమానమని చాటిచెప్పారని గుర్తు చేశారు. బహుజన చైతన్యంతో పూలే ఆలోచనా విధానాలను నేటికీ బహుజన సమాజం ఆచరిస్తోందని, ఆయన ఆశయాల వల్లనే నేడు సామాన్యులకు విద్య, గౌరవం దక్కుతున్నాయని అన్నారు.
తరాలు గడిచినా పూలే చరిత్ర నేటికీ శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తున్నారంటే అది ఆయన గొప్పతనమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ, బీసీ అభివృద్ధి అధికారి ఖలీల్, జ్యోతిరావు పూలే బీసీ సంఘం రాష్ట్ర కోశాధికారి ఉప్పరి రాజు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు మరియు జిల్లా కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

