పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 28. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ సబ్ టైటిల్ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రతి దశలో ప్రజలకు అండగా ఉంటాం కుక్కల బెడద సమస్య పరిష్కారానికి పటిష్ట చర్యలు ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లపై లబ్ధిదారులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
ఖమ్మం : నిధులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ లబ్ధిదారులు నాణ్యతతో కూడిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ ఏన్కూరు మండలం, రేపల్లెవాడ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రణాళిక వివరాలను కలెక్టర్ లబ్ధిదారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. గ్రామంలో రైతులు ఎటువంటి పంటలు పండించుకుంటు న్నారు, దిగుబడి ఎంత వస్తుంది, గ్రామాల్లో ఇతర సమస్యల గురించి కలెక్టర్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు ఎలా కట్టుకోవాలి అనే స్వేచ్ఛ పూర్తిగా లబ్ధిదారులకు ప్రభుత్వం అందించిందని అన్నారు. సొంత ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అందించే ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని పూర్తి స్థాయిలో సమర్థతతో వినియోగిస్తూ నాణ్యతతో కూడిన ఇంటి నిర్మాణం చేయాలని అన్నారు. ఇంటి నిర్మాణం ప్రణాళిక, ఎంత ఇసుక అవసరం, ఎంత సిమెంట్, ఇటుక కావాలి మొదలగు అంశాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే మేస్త్రీలు తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని, నాణ్యతతో కూడిన పరికరాలు తక్కువ ధరకు కొనుగోలు చేసేలా చొరవ చూపాలని కలెక్టర్ కోరారు. ఏన్కూరు మండల హెడ్ క్వార్టర్ తహసిల్దార్ కార్యాలయంలో మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం జరుగుతుందని, అక్కడ చూసి అవసరమైన వారు నేర్చుకోవాలని అన్నారు. మన దగ్గర ఉన్న డబ్బును దుర్వినియోగం చేసుకోకుండా నాణ్యతతో ఇండ్లు నిర్మించుకునేందుకు ఈ అవగాహన కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు. మనం కట్టుకునే ఇంటిలో చార్జింగ్ పాయింట్స్ ఎక్కడ పెడుతున్నాం, మిక్సీ పెట్టుకోవడానికి కేబుల్ ఎక్కడ ఉంటుంది వంటి ప్రతి అంశాన్ని కూడా ప్లాన్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి చిన్న అంశంలో మనం శ్రద్ధ వహించి ఇంటి నిర్మాణం చేస్తే ఆశించిన బడ్జెట్లో మంచి ఇల్లు మనకు సిద్ధమవుతుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం అవసరమైన ఇసుకను ప్రతి మండల కేంద్రానికి తీసుకుని వచ్చే బాధ్యత జిల్లా యంత్రాంగం తీసుకుంటుందని, మండల కేంద్రం నుంచి లబ్ధిదారుడు ఇంటి నిర్మాణానికి తక్కువ ధరతో ఇసుక తరలించేలా చూడాలని అన్నారు. మండల కేంద్రంలో పెట్టే ఇసుక డంప్ దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సంపూర్ణ అవగాహన ఉండాలని కలెక్టర్ తెలిపారు. భూమి పూజ నుంచి గృహప్రవేశం వరకు ఇంటి నిర్మాణంలో ప్రతి అడుగులో లబ్ధిదారులకు తోడ్పాటు అందిస్తామని అన్నారు. సిమెంట్ కూడా ఇందిరమ్మ లబ్ధిదారులకు తక్కువ ధరకు సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని, ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. రేపల్లె వాడ గ్రామంలో కుక్కల సమస్య గురించి తెలుసుకున్న కలెక్టర్ వీధి కుక్కలను పట్టుకొని ఖమ్మంలో ఉన్న ఆనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ లో వాటికి ఆపరేషన్ చేయించాలని ఎంపీడీఓ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌజింగ్ పిడి శ్రీనివాసరావు, ఏన్కూరు మండల తహసీల్దార్ శేషగిరిరావు, ఎంపిడివో రమేష్, రేపల్లెవాడ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్, కాంగ్రెస్ నాయకులు అజ్మీర సురేష్ అధికారులు తదితరులు పాల్గొన్నారు