పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 24. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలి…. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ నీటి విడుదల షెడ్యూల్ పై రైతులకు ముందుగా సమాచారం అందించాలి రైతులకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయి పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామంలో పర్యటించి రైతులతో ముచ్చటించిన జిల్లా కలెక్టర్ ఖమ్మం: రైతుల పంట పొలాలకు సాగు నీటి విడుదల సమయంలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.సోమవారం జిల్లా కలెక్టర్ పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామంలో పర్యటించి వ్యవసాయ పొలాల వెంబడి రెండు కిలోమీటర్ల వరకు నడుస్తూ రైతులతో ముచ్చటించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ సాగు నీటి విడుదల షెడ్యూల్ ను సంబంధిత ఆయకట్టు రైతులకు ముందుగానే సమాచారం అందించాలని అధికారులకు తెలిపారు. టెయిల్ ఎండ్ విధానంలో సాగునీరు సరఫరా జరగాలని ముందుగా చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరు విడుదల కావాలని అన్నారు. మండలంలో రైతులకు అవసరమైన మేర యూరియా నిలువలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి సహకార సంఘం వద్ద యూరియా నిల్వలు ఉండాలని, ఎప్పటి కప్పుడు నిల్వలను పరిశీలిస్తూ స్టాక్ విషయమై పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో పెద్ద రైతులతో ఇతర రైతులకు సాగు పద్ధతులు, వ్యవసాయ అధికారులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో అమలు అవుతున్న పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. రైతులు లాభసాటి పంట సాగు చేయాలని అన్నారు. వ్యవసాయంతో పాటు పాడి పశువులు పెంచుకుంటే మనకు ఆదాయం లభిస్తుందని కలెక్టర్ సూచించారు. రైతుల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, గ్రామంలో త్రాగునీటి సరఫరా, పాఠశాల, ఆసుపత్రి పనితీరు ఎలా ఉన్నది మొదలగు వివరాలను తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఇ వాసంతి, వ్యవసాయ శాఖ ఏడి శ్రీనివాస రెడ్డి, పెనుబల్లి మండల తహసీల్దార్ జి. సుధీర్, ఎంపిడిఓ డి. అన్నపూర్ణ, మండల వ్యవసాయ అధికారి ప్రసాద్, శ్రీనివాస్, ఇర్రిగేషన్ ఏఇ ఖాదర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.