పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 24. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ నూతన అంశాలను నేర్చుకోవాలనే ఉత్సుకత విద్యార్థులు అలవర్చుకోవాలి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ 10వ తరగతి పరీక్షలలో మెరుగైన ఫలితాల సాధనకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి రాబోయే నెల రోజుల పాటు ఫోన్, టీవీలకు దూరంగా ఉండాలి విద్యార్థులు పౌష్టికాహారం తీసుకోవాలి పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామంలోని మోడల్ పాఠశాల, కళాశాల ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఖమ్మం : నూతన అంశాలను నేర్చుకోవాలనే ఉత్సుకత విద్యార్థులు అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
సోమవారం జిల్లా కలెక్టర్ పెనుబల్లి మండలం, టేకులపల్లి గ్రామంలో పర్యటించి తెలంగాణ మోడల్ పాఠశాల, కళాశాలను తనిఖీ చేశారు. ఉపాధ్యాయుడిలా 10వ తరగతి విద్యార్థులకు కలెక్టర్ సోషల్ స్టడీస్ క్లాస్ తీసుకున్నారు. బెంగాల్ విభజన, ఇండియా మ్యాప్, వాతావరణం వంటి పలు అంశాలను కలెక్టర్, చాక్ పీస్ తో బోర్డుపై బొమ్మలు వేస్తూ విద్యార్థులకు కూలంకషంగా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలను పెట్టుకోవాలని, వాటి సాధన దిశగా నూతన అంశాలను నేర్చుకోవాలనే ఉత్సుకతను అలవర్చుకోవాలని కలెక్టర్ సూచించారు.
రాబోయే పదవ తరగతి పరీక్షలలో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని కలెక్టర్ తెలిపారు. మనం వీక్ గా ఉన్న సబ్జెక్టుపై శ్రద్ధ పెట్టాలని, గతంలో జరిగిన పరీక్షల ప్రశ్నా పత్రాలను పరిశీలించి రెగ్యులర్ గా వచ్చే ప్రశ్నలకు సంపూర్ణంగా సిద్ధం కావాలని అన్నారు. తరగతి గదిలో బాగా చదివే పిల్లలు కొంత వెనుకబడిన పిల్లలకు సహాయం చేయాలని, ఇతరులకు మనం ఒక అంశాన్ని బోధిస్తే ఆ అంశం మనకు బాగా గుర్తుంటుందని అన్నారు.రాబోయే నెల రోజులపాటు విద్యార్థులు సెల్ ఫోన్, టీవీ లకు దూరంగా ఉండాలని, పూర్తి సమయం పరీక్షలకు సిద్ధమయ్యేందుకే కేటాయించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి రోజు ఉదయం సమయమ లేచి చదువు కోవాలని అన్నారు. పెట్రోల్ లేకుండా కారు నడవడం ఎలా సాధ్యం కాదో, అదేవిధంగా ఖాళీ కడుపులతో ఉంటే చదువు మెదడుకు ఎక్కదని, విద్యార్థులు తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు ప్రణాళిక ప్రకారం సిద్ధం కావాలని అన్నారు. జీవితంలో ఎదురు దెబ్బలు సహజమని, అట్టి పరిస్థితులను ఎదుర్కొని లక్ష్యం దిశగా కృషి చేసిన వారే విజయం సాధిస్తారని కలెక్టర్ తెలిపారు.అనంతరం పాఠశాలలో టాయిలెట్స్ ఎలా ఉంటున్నాయి, రెగ్యులర్ గా క్లీన్ చేస్తున్నారా, మధ్యాహ్న భోజనం నాణ్యత ఎలా ఉంది, స్నాక్స్ ఏం ఇస్తున్నారు మొదలగు వివరాలను కలెక్టర్ పిల్లలను అడిగి తెలుసుకున్నారు. ఇంకనూ కావాల్సిన వసతులను గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రిన్సిపాల్ రాంప్రసాద్, పెనుబల్లి మండల విద్యాధికారి సత్యనారాయణ, తహసీల్దార్ సుధీర్, ఎంపిడిఓ అన్నపూర్ణ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.