
పయనించే సూర్యుడు న్యూస్ :మగ పిల్లలపై విపరీతమైన ఆశ, ఆడపిల్లలపై వివక్ష మరో దారుణానికి కారణమైంది. కొడుకు లేడనే మనస్తాపంతో ఓ తల్లి కిరాతకానికి పాల్పడింది. మూడు రోజుల వయసున్న శిశువును చంపి అమ్మతనానికే మాయనిమచ్చ తెచ్చింది. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లా రామ్దుర్గ్ తాలూకాలోని హిరేములంగి గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.నిందితురాలు అశ్విని హల్కట్టికి ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఆమె మగబిడ్డ కోసం ఆశగా ఎదురుచూసింది. నవంబర్ 23న ఆమెకు మళ్లీ ఆడ శిశువు జన్మించింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన అశ్విని, మంగళవారం ఉదయం తన తల్లి ఇంట్లో లేని సమయం చూసి, నవజాత శిశువును గొంతు కోసి చంపేసింది. ఆ తర్వాత ఆమె శిశువు ఊపిరి ఆడటం లేదని నటించి, అందరినీ నమ్మించడానికి ప్రయత్నించింది. శిశువును ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె గొంతు కోయడం వల్ల మరణించినట్లు ధృవీకరించారు. విచారణలో నిందితురాలు తన నేరాన్ని అంగీకరించింది. ఆమెపై సురేబన్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేశారు.
కర్ణాటకలో కొనసాగుతున్న వివక్ష : ఆడపిల్లలపై వివక్ష కారణంగా ఇలాంటి దారుణాలు కర్ణాటకలో ఇది కొత్తేమీ కాదు. గతంలో 2024 ఫిబ్రవరి 29న ధార్వాడ్ జిల్లాలోని యాద్వాడ్ గ్రామంలో శంబులింగ షాహపూర్మత్ అనే తండ్రి.. రెండవ సంతానమైన తన ఏడు నెలల పాపను గోడకేసి కొట్టి చంపేశాడు. మగబిడ్డ పుట్టలేదని ఈ దారుణానికి పాల్పడ్డాడు.రాష్ట్రంలో తగ్గుతున్న స్త్రీ-పురుష లింగ నిష్పత్తి పట్ల కర్ణాటక ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆరోగ్య మంత్రి దినేష్ గుండూ రావు ప్రకారం.. ఈ వివక్షకు పాక్షికంగా వ్యవస్థీకృత భ్రూణహత్యల రాకెట్లే కారణం. 2023-24 ప్రారంభం నుంచి ఆడ భ్రూణహత్యలకు సంబంధించి రాష్ట్రంలో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. వీటిలో 46 మంది వ్యక్తులను అరెస్టు చేశారు.ఆడ భ్రూణహత్యలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం PC – PNDT చట్టాన్ని రాష్ట్ర, జిల్లా స్థాయిలో కఠినంగా అమలు చేస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఇప్పటివరకు 136 కేసులు కోర్టులో దాఖలు చేయగా 74 కేసుల్లో జరిమానాలు విధించడం లేదా స్కానింగ్ కేంద్రాలను మూసివేయడం జరిగింది. మగపిల్లల కోసం ఆశతో అమాయక శిశువుల ప్రాణాలు తీస్తున్న ఈ దురాచారాన్ని అరికట్టడానికి చట్టం అమలుతో పాటు సమాజంలో అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.