
పయనించే సూర్యుడు జూన్ 23 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట
నియోజక వర్గంలో ఒకప్పుడు సాగునీటి ప్రధాన వనరుగా ఉన్న నెర్రి కాలువ నేడు కనుమరుగవుతున్న పరిస్థితి రైతులు, ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాలువపై అక్రమ ఆక్రమణలు, నిర్మాణాలు పెరిగిపోవడంతో అసలు కాలువ ఎక్కడుందో గుర్తించలేని దుస్థితి నెలకొంది. కాలువ మధ్యలో పిచ్చి మొక్కలు, చెట్లు పెరిగిపోవడంతో నీటి ప్రవాహానికి పూర్తిగా అడ్డంకులు ఏర్పడ్డాయి. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో అధికారులు ఇప్పటికైనా స్పందించి నెర్రి కాలువకు పూర్తి స్థాయి సర్వే నిర్వహించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.కాలువ హద్దులను గుర్తించి రాళ్లు నాటి, ఆక్రమణలను తొలగించి నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. నెర్రి కాలువ ద్వారా వచ్చే నీటిపైనే పరిసర ప్రాంతాల పంటలు ఆధారపడి ఉన్నాయని రైతులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం కాలువలు, చెరువులు ఆక్రమణలకు గురవుతుండటంతో భవిష్యత్తులో భారీ వర్షాలు కురిస్తే వరదనీరు ఇళ్లలోకి చేరే ప్రమాదం ఉందని ప్రజలుహెచ్చరిస్తున్నారు. ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించే పరిస్థితులు ఏర్పడకముందే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల సమస్యలు, ప్రజల గోడు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి వనరులను కాపాడి రైతులకు నీరు అందిస్తేనే వ్యవసాయం నిలబడుతుందని, లేకపోతే సూళ్లూరుపేట ప్రాంతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.