ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు విరామం లేని పని!
భోజనం చేసే పరిస్థితి కూడా లేదంటున్న కార్మికులు!
కన్నాయిగూడెం గ్రామ కార్యదర్శి వింత పోకడలు?
చర్యలు తీసుకోవాలంటున్న కార్మికులు!
పయనించే సూర్యుడు ఆగస్టు 26 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్ :మండల పరిధిలోని కన్నాయిగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శి పంచాయతీ కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తూ కనీస గౌరవ మర్యాదలు కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారని, కనీసం జీతాలు కూడా చేసే పరిస్థితి లేదని ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పంచాయతీ కార్మికులు విధుల్లోనే ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతుందని గ్రామపంచాయతీ కార్మికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీలో ఐదు గ్రామాలు ఉండగా కేవలం ముగ్గురు కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారని అందులో ఒకరు ట్రాక్టర్ డ్రైవర్ గా ఉన్నారని మిగిలిన ఇద్దరూ ఆయా పనులను నిర్వహిస్తూ ఉంటారని, గ్రామపంచాయతీ పరిధిలో ఎన్ని పనులు ఉన్నా వీరు ముగ్గురు మాత్రమే చేయాల్సి ఉంటుందని, ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కార్యదర్శి ఎప్పుడు ఏదో ఒక విధంగా అగౌరవంగా, అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని, గతంలో ఉన్న కార్యదర్శులకు భిన్నంగా వ్యవహరిస్తూ మమ్ములను బానిసలుగా చూస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పనిచేయాల్సి వస్తుందని, ఉదయము వాటర్ ట్యాంకులు నింపి నీళ్లు గ్రామానికి వదలాలని, సాయంత్రము కూడా వాటర్ ట్యాంకులు నింపి గ్రామానికి నీళ్లు వదలాలని, ఐదు గ్రామాలలో ఏ పనులు వచ్చిన మేమే చేయాల్సి వస్తుందని, ఒక్కోసారి భోజనం చేసే పరిస్థితి కూడా లేదని, ఇంత కష్టపడి పనిచేస్తున్న కేవలం రు.300.లు మాత్రమే ఇస్తున్నారని, నీళ్లు వదులుట, చెత్త ఎత్తుట, పైపులైను లీకేజీలు చేయుట, రోడ్ సైడ్ బుష్ కటింగ్ చేయుట, వాటర్ ట్యాంకులు శుభ్రపరచుట, గ్రామ సభలకు ప్రజలను పిలవడం, గ్రామ పంచాయతీలో ఉన్న అన్ని పనులను కూడా మమ్ములను ఉపయోగించుకుంటూ గ్రామ కార్యదర్శి మమ్ములను బానిసలుగా చూస్తున్నారని, ఉపాధి హామీ పనుల్లో భాగంగా త్రవ్వించాల్సిన 8 ఇంకుడు గుంతలను మాతోనే తవ్వించి కార్యదర్శి ఫీల్డ్ అసిస్టెంట్ కలిసి బిల్లులు చేయించుకున్నారని పంచాయతీ కార్మికుల ఆరోపిస్తున్నారు. గతంలో ఒక నెల రోజుల జీతం చేయకుండా మమ్ములను ఇబ్బందులకు గురి చేశారని, ఇప్పుడు కూడా జీతాలు చేయమంటే పంచాయతీలో నిధులు లేవు మీ ఇష్టమైతే పని చేయండి లేకపోతే వెళ్లిపోండి అని దురుసుగా ప్రవర్తిస్తున్నారని, జీతాలు చేయాలంటే మూడు కేజీల పందెం కోడి పుంజును ఇవ్వాలని ఒత్తిడి చేశారని, గతంలో కార్మికులు పనిచేసే ప్రదేశానికి కార్యదర్శి వచ్చేవారు కాదని, ఈ మధ్యకాలంలో ఇందిరమ్మ గృహాల విషయంలో మాత్రమే గ్రామ పంచాయతీకి వస్తున్నారని, ఈ విధంగా తమ ఇష్టారాజ్యం వ్యవహరిస్తూ మమ్ములను ఇబ్బందులకు గురిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి పై తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని పంచాయతీ కార్మికులు కోరుతున్నారు.